ఫోన్లో కంప్లైంట్ ఇస్తే చాలు..!
– ఇక ఇంటి వద్దనే ఎఫ్ఐఆర్ నమోదు
– జిల్లా పోలీసు శాఖ కీలక నిర్ణయం
– బాధితులకు భరోసా కల్పించ చర్యలు
– వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బాధితులు పోలీస్టేషన్‌కు వెళ్లకుండానే ఫోన్ ద్వారా పిర్యాదు చేస్తే ఇంటి వద్దకు వచ్చి అక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేసే చర్యలు చేపట్టింది.

ఈ మేరకు వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఈ విషయాన్ని శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో ఈ విధానం పకడ్బందీగా అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రత్యేకంగా మహిళలు, పిల్లలు, బలహీన వర్గాల వారికి ఈ విధానంలో సేవలు అందించడం జరగుతుందని చెప్పారు. లైంగిక నేరాలు, హత్యాయత్నం, గాయపరిచే ఘటనలు, దొంగతనం, దోపిడీ, చోరీ వంటి ఆస్తి సంబంధిత నేరాలు, పోక్సో కేసులు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు, బాల్య వివాహ నిరోధక చట్టాలకు సంబంధించిన కేసుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.

మహిళలు, పిల్లల కేసుల్లో మహిళా పోలీసు అధికారిని తప్పనిసరిగా పంపించడం జరుగుతుందని, అవసరమైతే ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయుల సమక్షంలో వాంగ్మూలం నమోదు చేస్తారని వివరించారు. ముఖ్యమైన కేసుల్లో పోలీసులు సంఘటన స్థలాన్ని రక్షించి, సాక్ష్యాలను సేకరించే చర్యలు వెంటనే ప్రారంభిస్తారని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల బాధితుల ఫిర్యాదు నమోదు ప్రక్రియ వేగవంతమవుతుందని, బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లే ఇబ్బంది తగ్గుతుందని అన్నారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని నేరాలను నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.



