అన్ని పథకాలు ఒకే కార్డులో..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

అన్ని పథకాలు ఒకే కార్డులో..!
– ప్రతి పౌరుడికి పంపిణీ
– అనర్హుల ఏరివేతకు అవకాశం
– కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్దిదారుల వివరాలు తెలిసేలా ఒకే కార్డును అందించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘సమగ్ర సంక్షేమ కార్డు’ (యూనిఫైడ్ కార్డ్) పేరుతో అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ కార్డు ద్వారా లబ్ధిదారుడు ఏ శాఖ నుంచి, ఏ పథకం కింద, ఎంత మేర ప్రయోజనం పొందుతున్నాడో పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అన్ని శాఖల లబ్ధిదారుల డేటాను సమీకరించి పారదర్శకంగా సంక్షేమ సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్డు అమల్లోకి వస్తే సంక్షేమ పథకాల నిర్వహణ మరింత సమర్థవంతంగా మారే అవకాశం ఉంటుందన్నారు.

ఈ కార్డ్‌లో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఫీజు రీయింబర్స్‌మెంట్, కార్మిక శాఖ, విద్యా శాఖ, ఇన్సూరెన్స్ పథకాలు, ప్రభుత్వం తీసుకువస్తున్న బీమా పథకాల వివరాలు ఉండేలా కసరత్తు చేస్తోంది. అవసరమైతే ఆధార్ నంబర్‌ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్‌ ఇచ్చేలా ఆలోచన చేస్తోంది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను కూడా ఈ కార్డ్‌కు అనుసంధానించాలని కూడా భావిస్తున్నారు.

ఇందుకోసం ఐటీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని దృష్టిసారిస్తున్నారు. ఈ సర్వే ద్వారా అనర్హులను గుర్తించడం సులభమవుతుందని భావిస్తున్నారు. ప్రతి శాఖ వేర్వేరుగా కార్డులు ఇచ్చే పద్ధతికి బదులు, ఐటీ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర సంక్షేమ కార్డ్ ఉండాలని సీఎం సూచించారు.లబ్ధిదారుల వివరాలతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను సేకరించాలని ఐటీ శాఖను ఆదేశించారు.

ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ ఉండాలని సీఎం సూచించారు ఎక్కడైనా మరణ ధృవీకరణ పత్రం జారీ అయితే, ఆ సమాచారం చేయూత పెన్షన్ డేటాబేస్‌కు చేరాలని, వెంటనే దాని ఆధారంగా చర్యలు మొదలయ్యేలా ఉండాలన్నారు. ప్రజల ఆరోగ్య ప్రొఫైల్‌ను కూడా సమగ్ర సంక్షేమ కార్డ్ తో లింక్ చేయాలని చెప్పారు.

పసి బాలుడిపై వీధి కుక్క వీరంగం