ప్రతి గ్రాడ్యుయేట్‌ను నేరుగా కలవాలి..!
– ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి తప్పని సరి
– బీఆర్ఎస్ తాండూరు ఇంచార్జి శ్రీశైల్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ప్రతి పట్టభద్రుడిని వ్యక్తిగతంగా కలిసి ఓటు అభ్యర్థించాలని బీఆర్ఎస్ తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి శ్రీశైల్‌రెడ్డి పంజుగుల పార్టీ శ్రేణులకు సూచించారు.

బుధవారం తాండూరులోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో గ్రామాలు, వార్డుల ఇన్చార్జులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కార్యాచరణలో భాగంగా అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాలని, గ్రామాలు, వార్డుల వారీగా ఓటర్ల వివరాలను సేకరించాలని శ్రీశైల్‌రెడ్డి సూచించారు.

పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో క్లస్టర్లను ఏర్పాటు చేసి, ఒక్కో క్లస్టర్‌కు ముఖ్య నాయకులను బాధ్యులుగా నియమించాలని అన్నారు. ఎన్నికల వరకు గ్రాడ్యుయేట్లతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ పార్టీ అభ్యర్థికి మద్దతు కూడగట్టాలని పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీకి చేపట్టిన చర్యలు, విదేశీ విద్య పథకం ద్వారా విద్యార్థులకు అందించిన ఆర్థిక ప్రోత్సాహం వంటి అంశాలను పట్టభద్రులకు వివరించాలని సూచించారు. గ్రాడ్యుయేట్ల సమస్యలను తెలుసుకుని, వారి అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తూ సమన్వయంతో పనిచేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, గ్రామాలు, వార్డుల ఇన్చార్జులు, ఇతర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


