పైలెట్‌పై తప్పుడు ప్రచారం చేస్తే ఖబడ్దార్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పైలెట్‌పై తప్పుడు ప్రచారం చేస్తే ఖబడ్దార్..!
– రాజకీయ లబ్ది కోసంమే దుష్ప్రచారం
– చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి
– తాండూరు బీఆర్ఎస్ పార్టీ నేతల డిమాండ్
– డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డిని బీఆర్ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు.

ఇలాంటి ప్రచారానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం తాండూరు డీఎస్పీ నర్సింగ్‌ యాదయ్యకు ఫిర్యాదు చేశారు. అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ కృష్ణ నాయక్‌, నరేష్‌, ఎన్‌కే నవీన్‌కుమార్‌, ‘తాండూరు యువత’ పేర్లతో ఉన్న నంబర్ల ద్వారా వాట్సాప్‌ గ్రూపులు, ఛానళ్లలో ఈ ప్రచారం సాగిందని ఆరోపించారు.

తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి రాజకీయంగా గందరగోళం సృష్టిస్తున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తాండూరుకు చెందిన ఓ వాట్సాప్‌ గ్రూపుతో పాటు మరో వాట్సాప్‌ ఛానల్‌లో పలు పేర్లతో ఉన్న నంబర్ల ద్వారా రోహిత్‌రెడ్డిపై అగౌరవకర వ్యాఖ్యలు చేస్తూ తప్పుడు ప్రచారం సాగించారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవమని పేర్కొంటూ, ఇలాంటి సమాచారంతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సోషల్‌ మీడియాను అడ్డుపెట్టుకుని వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని అన్నారు. తప్పుడు ప్రచారం వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ తాండూరు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, తాండూరు మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, యాలాల మండల నాయకులు సిద్రాల శ్రీనివాస్, కౌన్సిలర్లు ఈర్షాద్, యోగానంద్, సురేష్‌ నాయక్, నాయకులు సంతోష్ గౌడ్, రుద్రుపాటిల్, కరుణాకర్, ఎజాజ్, క్రిష్ణకుమార్, వెంకటేష్‌ చారి, పలు మండలాల నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

Pvr

పండగ పూట తాగునీటి తిప్పలు