చలికాలం జ‌ర‌భ‌ద్రం..!

ఆరోగ్యం తాండూరు తెలంగాణ రంగారెడ్డి లైఫ్-స్టైల్ వికారాబాద్

చలికాలం జ‌ర‌భ‌ద్రం..!
– జాగ్ర‌త్త‌లే మేలంటున్న నిపుణులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: రోజు రోజు చ‌లి ప్ర‌భావం అధిక‌మవుతోంది. ఈ చ‌లికాలం చిన్నారులు, వృద్ధులు భ‌ద్రంగా ఉంటేనే మేల‌ని నిపుణులు సూచిస్తున్నారు. గ‌త వారం రోజులుగా చలి తీవ్రత రోజు రోజుకూ పెరిగిపోతుంది. పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి ప్రభావం మొదలవుతుంది. ఇక సాయంత్రం 6 గంటల నుంచి చలి తీవ్రత మరింత పెరిగిపోతుంది. ఈ సీజన్‏లో అనారోగ్య సమస్యలు జలుబు, దగ్గు వంటి సమస్యలు తీవ్రంగా వేధిస్తుంటాయి. శీతకాలంలో చలి తీవ్రతను తట్టుకోవడానికి.. కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. అనారోగ్య సమస్యలను మరింత ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు.

చ‌లి నుంచి కాపాడే చ‌ర్య‌లు

– కాలంలో చలి నీళ్లతో స్నానం చేయవద్దు. వేడి నీళ్లతో స్నానం చేయాలి. వేడి వేడి పదార్దాలను ఆహారంగా తీసుకోవాలి.
– చల్లగాలి చెవులు, ముక్కులోకి పోతే జలుబు, తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది. ఉదయం, సాయంత్రం బయటకు వెళ్లేముందు చెవులు, ముక్కును కప్పేలా వస్త్రాలు ధరించాలి.
– ఉదయం, సాయంత్రం చిన్నారులు, వృద్దులు బయటికి రావద్దు. స్వెట్టర్లు, వేడిని ఇచ్చే దుస్తులను ధరించాలి.
– ఉదయం వేళ పొగమంచు కురిసే ప్రమాదం ఉంది. కాస్త తెల్లవారిన తర్వాత.. ఎండ వస్తున్న సమయంలో ప్రయాణాలు చేయడం మంచిది. మంచు కురిసే సమయంలో రాత్రి, పగలు ప్రయాణించకపోవడమే మంచిది.
– చలికి బైక్స్ పై వెళ్లేవారు నిదానంగా వెళ్లాలి. చలికి చేతులు ఒణికి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది.
– చలి మంటలు వేసుకున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి. చలి జ్వరం, జలుబు వచ్చిన వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. చల్లని పదార్దాలకు దూరంగా ఉండాలి. కూల్ డ్రింక్స్, ఇతర చల్లని పానీయాలకు దూరంగా ఉండడం మంచిది. చిన్న పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
– రోజూ ఆలివ్‌ ఆయిల్, కొబ్బరినూనెతో మసాజ్‌ చేసుకుని తలస్నానం చేయాలి. వేడి నీటితో స్నానం చేస్తే చర్మం పొడి బారుతుంది. గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి.
– ఆస్తమా ఉన్నవారు చలికాలంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శ్వాస నాళాలు మూసుకుపోకుండా వైద్యుడి సలహా మేరకు మందులు వాడాలి. ఇన్‌హేలర్, నెబ్యులైజర్‌ వంటివి అందుబాటులో ఉంచుకోవాలి.
– గుండెజబ్బులు ఉన్న వారు, గుండె ఆపరేషన్‌ చేయించుకున్నవారు వాకింగ్‌ చేయకూడదు.
– చలిగాలులు వీస్తున్న సమయంలో ఇంటి తలుపులు, కిటికీలను మూసి ఉంచాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా ఉండేందుకు పొడి దుస్తులను ధరించాలి. చలి తీవ్రతతో జలుబు బాగా వచ్చి ఊపిరి తీసుకునే అవకాశం ఉండదు. అలాంటప్పుడు నెబ్యులైజర్‌ వినియోగించుకోవాలి.
– చలికి రాత్రి వేళ ఇంట్లోకి పాములు, విష పురుగులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే రాత్రిళ్లు ఇంటిని జాగ్రత్తగా పరిశీలించాలి. దుప్పట్లను బాగా దులిపి ఏం లేవని నిర్దారించుకున్నాకే వేసుకోవాలి.