విద్యాసంస్థలకు కోవిడ్ ఎఫెక్ట్
– ఈనెల 30 వరకు మూతే
– సెలవులను పొడగించిన సర్కారు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలోని విద్యాసంస్థలపై మరోసారి కరోనా మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు 16వ తేది వరకు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని వైద్యారోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించింది. ఎలాగు ఈనెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో ర్యాలీలు, సభలను జరపరాదని 9న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం సెలవులను కూడా మొదట 20వ తేదీ వరకు పొడిగిస్తారని అనుకున్నారు. వాటిని పక్కన పెట్టిన ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి మేరకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది కూడ కరోనా విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపింది. స్కూల్స్, కాలేజీలు మూత పడటంతో ఆన్‌లైన్ క్లాసులతో సరిపెట్టుకున్నారు విద్యార్థులు. మరోసారి సెలవులను పొడగించే అవకాశం పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా పాఠాలు బోధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

