కారులోనే వైఎస్ షర్మిల అరెస్టు
– క్రేన్‌తో కారుతో పాటు అదుపులోకి తీసుకున్న పోలీసులు
– రాజ్ భవన్ రోడ్డులో హైడ్రామా
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ప్రగతిభవన్ ముట్టడికి కారులో వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె కారులో డ్రైవింగ్ సీటులో ఉండగానే పోలీసులు భారీ క్రేన్ సహాయంతో కారుతో పాటు అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించిన షర్మిల స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌పై ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో తమ ఎమ్మెల్యేను ఉద్దేశించి షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం అడ్డుకునేందుకు యత్నించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయనే ఉద్దేశంలో నర్సంపేట ఏసీపీ సంపత్‌రావు షర్మిలను పాదయాత్రును నిలిపి వేయాలని కోరారు. కాని ఇందుకు షర్మిల నిరాకరించారు. ఈ క్రమంలో శంకరాం తండా సమీపంలో నిలిపిన షర్మిల కారవాన్‌పై కొందరు వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించారు. పక్కనే ఉన్న ఇన్నోవా వాహనం అద్దాలనూ పగలగొట్టారు. అనంతరం షర్మిలను హైదరాబాద్ తరలించారు. సోమవారం జరిగిన పరిణామాలకు నిరసనగా షర్మిల ప్రగతిభవన్‌కు బయల్దేరారు. నర్సంపేటలో ధ్వంసం చేసిన కారులో స్వయంగా డ్రైవ్ చేసుకుని నిరసనకు వెళ్తుండగా పంజాగుట్ట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వాహనం దిగాలని పోలీసులు కోరినప్పటికీ ఆమె వినలేదు. దీంతో ధ్వంసమైన కారు డ్రైవింగ్ సీట్లో షర్మిల కూర్చొని ఉండగానే పోలీసుల క్రేన్‌ను తెప్పించి అక్కడి నుంచి ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు వైఎస్ షర్మిల పట్ల పోలీసుల వైఖరిపై వైతెపా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు వైతెపా కార్యకర్తల ఆందోళనతో రాజ్‌భవన్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది.

