త‌డ‌బ‌డుతున్న టీనేజ్..!

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

త‌డ‌బ‌డుతున్న టీనేజ్..!
– టీకా తీసుకోవ‌డంలో అనాస‌క్తి
– అయోమ‌యంలోనే త‌ల్లిదండ్రులు
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డికోసం ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌డుతోంది. కేంద్ర ప్ర‌భుత్వం ద్వారా 60 ఏండ్ల వృద్ధులు, మ‌ధ్య వ‌య‌స్కులకు, 15 నుంచి 18 ఏండ్ల టీనేజ‌ర్ల‌కు కోవిడ్ టీకాను నిర్విరామంగా అంద‌జేస్తుంది. వికారాబాద్ జిల్లాలో టీనేజ‌ర్ల‌ను మిన‌హాయించి 60 ఏండ్ల వారికి, మ‌ద్య‌వ‌య‌స్సు వారికి మొద‌టి డోస్ వంద‌శాతం పూర్తి చేశారు. రెండో డోసును 51 శాతం పూర్తి చేశారు. కాని టీనేజ‌ర్ల‌పై అనుకున్నంత ల‌క్ష్యాన్ని చేరుకోలేదు. ఈనెల 3 మూడు నుంచి వికారాబాద్ జిల్లాలో 15 నుంచి 18 ఏండ్లు నిండిన టీనేజ‌ర్ల‌కు వ్యాక్సీనేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. 28 ద‌వ‌ఖానాల‌లో టీకా వేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. జిల్లాలో 77, 780 మంది పిల్ల‌లు ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 31 శాతం మాత్ర‌మే పూర్తి చేశారు. టీకాలు వేసేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నప్పటికీ…టీకా వేసుకుంటే జ్వరం, ఒంటి నొప్పులు వంటి కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందనే అపోహతో తల్లిదండ్రులు ఇందుకు అంగీకరించకపోవడం కూడా టీకాల్లో వెనుకబడి పోవడానికి కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాలేజీల‌కు సెల‌వులు పొడ‌గించ‌డంతో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు య‌జ‌మాన్యాలు కూడ ముందుకు రాలేక‌పోతున్నాయి. క‌రోనాను జ‌యించేందుకు టీకానే ఉత్త‌మ మార్గ‌మ‌ని తెలిసినా వివిధ ప‌రిస్థితుల కార‌ణంగా టీనేజ‌ర్లు వ్యాక్సీనేష‌న్ వేసుకునేందుకు త‌డ‌బాటు ప‌డుతున్నారు. దీనిపై ప్ర‌జ‌ల‌కు, టీనేజ‌ర్ల‌కు మ‌రింత అవ‌గాహన క‌ల్పించాల్సిన అవ‌స‌ముందని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.