జ్వ‌ర స‌ర్వేకు స‌హ‌క‌రించాలి: ఆర్డీఓ

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

ప‌క‌డ్బందీగా ఇంటింటి జ్వ‌ర స‌ర్వే
– వార్డుల వారిగా ప్ర‌త్యేక బృందాల ఏర్పాటు
– స‌ర్వేకు ప్ర‌జ‌లంద‌రు స‌హ‌క‌రించాలి
– తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : క‌రోనా క‌ట్ట‌డి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న ఇంటింటి జ్వ‌ర సర్వేకు స‌ర్వం సిద్దం చేసిన‌ట్లు తాండూరు ఆర్డీఓ, మున్సిప‌ల్ ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ అశోక్ కుమార్ తెలిపారు. గురువారం రాత్రి ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న‌లో మాట్లాడుతూ జిల్లా క‌లెక్ట‌ర్ కె. నిఖిల ఆదేశాల మేర‌కు మేర‌కు రేప‌టి నుంచి తాండూరు మున్సిప‌ల్ ప‌రిధిలో ఇంటింటి జ్వ‌ర స‌ర్వే చేప‌డుతున్న‌ట్లు తెలిపారు. మున్సిప‌ల్‌లోని 36వ వార్డుల‌లో చేప‌ట్టే స‌ర్వేకు సంబంధించి ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వార్డు స్పెష‌ల్ ఆఫీస‌ర్లు, మెప్మా ఆర్పీలు, అంగ‌న్‌వాడి టీచ‌ర్లు, వీఆర్ఓ సిబ్బందితో కూడిన ఈ బృందాలు ఇంటింటి స‌ర్వే చేప‌డుతార‌ని వివ‌రించారు. ప్ర‌జ‌లు ఇంట్లో ఎవ‌రికైనా ద‌గ్గు, జ్వ‌రంతో పాటు కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతుంటే సర్వేలో న‌మోదు చేయించుకోవాల‌న్నారు. ఈ స‌ర్వేలో కొవిడ్ ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు తేలిన వారికి హోం ఐసోలేష‌న్‌లో ఉంచి ఐసోలేష‌న్ కిట్ల ద్వారా చికిత్స అందించ‌డం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. 5 రోజుల త‌రువాత కూడ ల‌క్ష‌ణాలు త‌గ్గ‌క‌పోతే ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు నిర్వహిస్తున్న ఇంటింటి జ్వ‌ర స‌ర్వేకు అంద‌రు స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఆయా వార్డుల కౌన్సిల‌ర్లు కూడ భాగ‌స్వాములు కావాల‌ని కోరారు. మ‌రోవైపు ప్ర‌జ‌లు మాస్కు, భౌతిక దూరం, వ్యాక్సీనేష‌న్ సూత్రాలను పాటించి క‌రోనా క‌ట్ట‌డికి స‌హ‌క‌రించాల‌ని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ 2 టీకాలు వేసుకోవాల‌ని, 60 సంవత్సరాలు నిండిన వారు బూస్టర్ డోస్ వేసుకోవాల‌ని సూచించారు.