గ్రామదేవతకు ఘనమైన బోనం..!
– మంబాపూర్‌లో వైభవంగా జాతర ఉత్సవాలు
– ఆకట్టుకున్న ఎరుకలసారి భవిష్యవాణి
– దర్శించి.. తరించిన భక్తులు
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: కరుణించి గ్రామాన్ని కాపాడే గ్రామదేవతను భక్తులు శ్రద్దలతో ఘనమైన బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు..డోలు వాయిద్యాలతో పాటు ఎరుకలసాని భవిష్యవాణికి గ్రామమంతా దేవత సన్నిధిలో మమైరిపోయింది. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలోని మంబాపూర్‌లో గ్రామదేవత జాతర ఉత్సవాలను వైభవంగా జరుపుకున్నారు.
శుక్రవారం గ్రామంలో వెలసిన గ్రామ దేవత జాతర ఉత్సవాలలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు అమ్మవారి సేవలో తరించారు. జాతర ఉత్సవాల సందర్భంగా మహిళా భక్తులు అమ్మవారికి బోనాలతో నైవేద్యాన్ని సమర్పించారు. బోనాల ఊరేగింపు ముందు పోతురాజుల విన్యాసాలు, డప్పు డోలు వాయిద్యాలు జనరంజకంగా కొనసాగాయి. మరోవైపు జాతర ఉత్సవాలలో భాగంగా ఎరుకలసాని వినింపించి భవిష్య వాణి గ్రామస్తులను ఆకట్టుకుంది. అనంతరం ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు అమ్మవారిని దర్శించుకుని గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామస్తులను సల్లంగా చూడాలని వేడుకున్నారు.



