డిజిటల్ వ్యవసాయానికి ప్రాధాన్యత
– ఆధునిక సాగుకుకు సహాకారం
– భారత ప్రధాని నరేంద్రమోడి
– ఇక్రీషాట్ 50వ వార్షికోత్సవంలో పాల్గొన్న మోడి
దర్శిని డెస్క్: ప్రకృతి సాగు, డిజిటల్ సాగుకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోడి ఉద్ఘాటించారు. శనివారం తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇక్రిశాట్ (icrisat) 50వ వార్షికోత్సవంలో ప్రధాని మోడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్రిషాట్ మొక్కల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన రాపిడ్ జనరేషన్ అడ్వాన్స్మెంట్ సెంటర్ను మోడీ ప్రారంభించారు. అదేవిధంగా ప్రత్యేకంగా రూపొందించిన ICRISAT లోగోను ఆవిష్కరించి స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. అనంతరం మోడీ మాట్లాడుతూ వ్యవసాయాన్ని అందరికీ చేరవేయడంలో ఇక్రిశాట్ ఎంతో శ్రమించిందని, ఇందుకు శాస్త్రవేత్తల కృషి కూడ ఆద్వితీయమని ప్రశంసించారు. డిజిటల్ వ్యవసాయం అన్నది భారత భవిష్యత్తుగా ప్రధాని మోడీ చెప్పారు. దేశంలో 80 శాతం మంది సన్నకారు రైతులే ఉన్నారని.. అందరికీ కేంద్రం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ప్రకృతి సాగుకు, డిజిటల్ విధానంలో వ్యవసాయ విధానాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. నైపుణ్యం ఉన్న యువత.. ఈ దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. సాగులో ఆధునికత తీసుకువచ్చేందుకు రైతులకు అవసరమైన సహకారాన్ని అందిస్తున్నామన్నారు. రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని ప్రధాని చెప్పారు. పంట దిగుబడిని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని. క్రాప్ అసెస్ మెంట్, భూ రికార్డుల డిజిటలైజేషన్, సాగులో డ్రోన్ల వినియోగం వంటి చర్యలు అమలు చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు దేశంలో నదుల అనుసంధానాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు ప్రధాని మోడీ చెప్పారు. రైతులకు ఉపయోగకరంగా.. నీటి వనరులను అభివృద్ధి చేయనున్నామన్నారు. దేశంలో వాతావరణంలో కలుగుతున్న మార్పులు.. చిన్న రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని ప్రధాని మోడీ చెప్పారు. ఈ సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వాతావరణ మార్పులపై ఇతర దేశాలు కూడా తగిన విధంగా స్పందించాలని కోరిన విషయాన్ని ప్రధాని మోడీ.. ఇక్రిశాట్ వేదికపై గుర్తు చేశారు. అంతకుముందు ICRISAT అనేది ఆసియా, సబ్-సహారా ఆఫ్రికాలో అభివృద్ధి కోసం వ్యవసాయ రంగంలో పరిశోధనలు చేసే అంతర్జాతీయ సంస్థ అని ఇక్రిశాట్ డైరక్టర్ జాక్వెలిన్ డి ఆరోస్ వెల్లడించారు.

