హైద‌రాబాద్‌కు క‌ర్ణాట‌క క‌ల‌ప‌

క్రైం తాండూరు వికారాబాద్

హైద‌రాబాద్‌కు క‌ర్ణాట‌క క‌ల‌ప‌
– రెండు లారీల టేకు క‌ల‌ప ప‌ట్టివేత‌
– అటవీశాఖ అధికారుల‌కు అప్ప‌గించిన పోలీసుల‌
– ఇద్ద‌రిపై కేసు న‌మోదు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: క‌ర్ణాట‌క రాష్ట్రంలోని టేకు క‌లపను హైద‌రాబాద్‌కు అక్ర‌మ ర‌వాణా చేస్తున్న నిందితుల‌కు క‌ళ్లెం వేశారు వికారాబాద్ జిల్లా కోడంగ‌ల్ పోలీసులు. కోడంగ‌ల్ మీదుగా టేకు క‌ల‌ప ర‌వాణా చేస్తున్న రెండు లారీల‌ను ప‌ట్టుకుని అట‌వీశాఖ అధికారుల‌కు అప్ప‌గించారు. ఇందుకు సంబంధించిన వివ‌రాలిలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి ఆదేశాల మేర‌కు కోడంగ‌ల్ సీఐ అప్ప‌య్య ఆధ్వ‌ర్యంలో స్థానిక అంబేద్క‌ర్ చౌర‌స్తా వ‌ద్ద ఆదివారం తెల్ల‌వారు జామున నాకాబందీ నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో క‌ర్ణాట‌క రాష్ట్రం గుల్బ‌ర్గాకు చెందిన న‌యూమోద్దీన్, ష‌కీల్ ప‌టేల్ అనే వ్య‌క్తులు రెండు లారీల ద్వార టేకు క‌ల‌ప‌ను హైద‌రాబాద్‌కు అక్ర‌మంగా త‌ర‌లిస్తున్నారు. నాకాబందీలో లారీల‌ను ప‌ట్టుకుని నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. క‌ర్ణాట‌క నుంచి హైద‌రాబాద్ త‌ర‌లిస్తున్న టేకు క‌లప విలువ దాదాపు రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేశారు. ఈ మేర‌కు నిందితుల‌పై కేసు న‌మోదు చేసిన‌ట్లు సీఐ అప్ప‌య్య తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఎవ‌రైనా అక్ర‌మంగా క‌ల‌ప ర‌వాణాకు పాల్ప‌డితే నిందితుల‌పై పీడీ యాక్టు న‌మోదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. మ‌రోవైపు నాకాబందీలో ప‌ట్టుకున్న రెండు క‌ల‌ప లారీల‌ను అట‌వీశాఖ అధికారుల‌కు అప్ప‌గించారు.