తిరుమల భక్తులకు శుభవార్త
– ఆఫ్‌లైన్ సర్వదర్శనం టిక్కెట్లు జారీ
– రోజుకు 10 టోకన్లకు పరిమితి
దర్శిని డెస్క్ : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. దాదాపు ఆరు నెలల తరువాత ఆఫ్‌లైన్‌లో భక్తులకు సర్వ దర్శన టికెట్ల జారీకి అనుమతి ఇచ్చింది. టీటీడీ అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు. కరోనా పరిస్థితులతో నిలిపివేసిన సర్వదర్శన టోకెన్ల వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించారు. రోజుకు 10 వేల టోకెన్లను ఆఫ్ లైన్ ద్వారా జారీ చేస్తుంది. దీంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ప్రకటనతో టోకెన్లు పొందేందుకు భక్తులు తిరుపతిలోని క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. మరోవైపు రేపటి నుంచి ఉదయాస్తమాన సేవా టిక్కెట్లను కూడ ప్రారంభిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఉదయస్తమాన సేవా టికెట్టు కింద వ్యక్తిగతంగా విరాళమిచ్చిన భక్తులకు 25 ఏళ్ల పాటు సంవత్సరంలో ఒక రోజు దాతతో కలిపి ఆరు గురికి ఉదయస్తమాన సేవ కల్పించనున్నారు. అదే సంస్థలు అయితే 20 ఏళ్ల పాటూ ఉదయస్తమాన సేవలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని టీటీడీ పేర్కొంది. శని, ఆది, సోమవారాల్లో ఉదయస్తమాన సేవ భక్తులకు సుప్రభాతం, తోమాల, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకార సేవల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మంగళ, బుధ, గురువారాల్లో టికెట్లు పొందిన భక్తులకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదల పాదపద్మారాధన (మంగళవారం), తిరుప్పావడ సేవ(గురువారం), కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకార సేవల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. శుక్రవారాల్లో ఉదయస్తమాన సేవా టికెట్లు కలిగిన భక్తులకు సుప్రభాతం, అభిషేకం, తోమాల, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకార సేవల్లో పాల్గొనే అవకాశం ఉంది.

