భూముల క్రమబద్దీకరణకు చాన్స్
– నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
– మీ సేవా కేంద్రాల్లో ఏర్పాట్లు
దర్శిని డెస్క్: ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ఇండ్లు, ఇతర నిర్మాణాలు చేసుకున్న వారికి వాటిని క్రమబద్దీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. భూముల క్రమబద్దీకరణ కోసం అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను నేటి నుంచి చేపట్టింది. ఈ దరఖాస్తులను మీసేవ కేంద్రాల ద్వారా స్వీకరించేందుకు ఏర్పాట్లను ప్రారంభించింది. భూముల క్రమబద్దీకరణకు ఎవరు అర్హులు, ఏయే పత్రాలను అందించాలని ఉత్తర్వులలో స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం గతంలో చేపట్టిన క్రమబద్ధీకరణ – ప్రక్రియకు 2014 డిసెంబరు 30న జారీ చేసిన ఎంఎస్ నం. 58, 59 ప్రకారం నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. జీవో ఎంఎస్ 14ను అనుసరించి సోమవారం నుంచి వచ్చే నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఎవరు చేసుకోవచ్చంటే…
ఆక్రమణదారులు 2014 జూన్ 2కి ముందు నుంచే ఆ స్థలంలో నివాసం ఉంటున్నట్లు నిర్ధారించే ఆధారాలతో కలిగి ఉన్న వారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఈ నెల 14న రెవెన్యూశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబం (బీపీఎల్) అయితే 125 చ. గజాల లోపు భూమి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాంటి వారికి ఉచితంగా క్రమబద్ధీకరణ సేవలు వర్తిస్తాయి. 126 చ.గజాలు దాటి అక్రమించుకున్న వారు కూడ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది.
126 చ.గజాలు దాటితే ఇలా
అదేవిధంగా మురికివాడల్లో 125 చ.గజాల నుంచి 150 చ.గజాల వరకు ఆధీనంలో ఉంటే.. 02.06.2014 నాటి భూమి మూల ధరలో 10 శాతం, నోటిఫైడ్ మురికివాడ కాని ప్రాంతమైతే 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది. 250 చ.గజాల వరకు 25 శాతం, 500 చ.గజాల వరకు 50 శాతం, 500 చ.గజాలకు పైన ఆక్రమిత స్థలానికి 75 శాతం చెల్లింపులు చేయాలి. నివాసేతర నిర్మాణాలున్నట్లయితే ఆ భూములకు పూర్తిస్థాయి మూల ధర చెల్లించాలి. ఇదిలా ఉంటే తాజా ఉత్తర్వుల్లో పలు అంశాలపై స్పష్టత కొరవడింది. 2014 నాటి ఉత్తర్వుల్లోని నిబంధనలే వర్తిస్తాయని రెవెన్యూశాఖ పేర్కొంది. అయితే జీవో ఎంఎస్ సం 59 కింద ఆక్రమిత భూములకు చెల్లించాల్సిన రుసుం ఎన్ని కిస్తీల్లో, ఏ గడువు లోపల చెల్లించాలనేది స్పష్టత ఇవ్వలేదు.
దరఖాస్తుకు ఇవి ఉండాల్సిందే.
– ఆక్రమణదారు పేరు, భర్త/భార్య పేరుతో పాటు తండ్రి/భర్త, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తుత చిరునామా ఆక్రమించిన అభ్యంతరం లేని ప్రభుత్వ భూమి/భూ పరిమితి, మిగులు భూమి వివరాలు.
– ఆక్రమిత స్థలం విస్తీర్ణం సర్వే నం. గ్రామం/వార్డు/మండలం, ఏ తేదీ నుంచి ఆక్రమణలో ఉంది? (ఆధారాలు జత చేయాలి).
– దరఖాస్తుదారు గుర్తింపు రుజువు (ఆధార్/ ఓటరు గుర్తింపు కార్డు/ డ్రైవింగ్ లైసెన్సు/బ్యాంకు ఖాతా/పాస్పోర్టు) భూమి స్వాధీనంలో ఉన్నట్లు నిర్ధారించే పత్రాలు (రిజిస్ట్రేషన్ దస్తావేజులు / ఆస్తిపన్ను చెల్లింపు రసీదు / విద్యుత్ బిల్లు రసీదు/కొళాయి బిల్లు రసీదు/ స్థానిక సంస్థల నుంచి జారీ చేసిన భవన నిర్మాణ అనుమతి పత్రం) నివాస/నివాసేతర కట్టడం విస్తీర్ణం (చ. గజాల్లో (ఉత్తర్వుల్లోని మార్గదర్శకాలు అనుసరించి) ఆక్రమణదారుకి సంబంధిత అధికారులు నుంచి ఏవైనా నోటీసులు అందితే వాటి వివరాలు, కోర్టు కేసులుంటే ఆ వివరాలు స్వీయ ధ్రువీకరణ, ఫొటో తప్పనిసరి

