రాజీవ్ స్వగృహా వేలానికి స్పందన అంతంతే..!
– బహిరంగ వేలంలో నాలుగు ప్లాట్లే అమ్మకం
– ప్రభుత్వానికి రూ. 1కోటి 23 లక్షల ఆదాయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో నిర్వహించిన రాజీవ్ స్వగృహా ప్లాట్ల వేలానికి స్పందన అంతంత మాత్రమే లభించింది. సోమవారం మొదటి విడతలో నిర్వహించిన బహిరంగ వేలంలో నాలుగు ప్లాట్లు మాత్రమే అమ్ముడు పోయాయి. హైదరాబాద్ రోడ్డు మార్గంలోని రాజీవ్ స్వగృహా కాలనీలోని బహిరంగ వేలం ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లా కలెకర్టర్ కె. నిఖిల ఆధ్వర్యంలో ఆడిషనల్ కలెక్టర్ మోతిలాల్ వేలం ప్రక్రియను ప్రారంభించారు. మొదటి విడతలో 17 ప్లాట్ల వేలానికి రూ.10 వేల చొప్పున డీడీలు చెల్లించిన 24 మంది వేలంలో పాల్గొన్నారు. 250 గజాల ప్లాట్లకు జరిగిన వేలంలో ఇందూరు మొగులప్ప గజానికి రూ. 12 వేల చొప్పున రూ. 62లక్షల 40 వేలకు సొంతం చేసుకున్నారు. చీకటి మర్ల రమేష్. అనే వ్యక్తి 250 గజాల ప్లాటును రూ.10,600ల చొప్పున రూ. 26 లక్షల 50 వేలకు సొంతం చేసుకున్నారు. అదేవిధంగా 150 గజాలకు సంబంధించిన ప్లాట్లలో రాచూరీ సునీల్ కుమార్ అనే వ్యక్తొ రూ. 10,800ల చొప్పున రూ. 16 లక్షల 20వేలకు దక్కించుకోగా… వై. వీరకుమార్ అనే వ్యక్తి మరో 150 గజాల ప్లాటును రూ. 12 వేల చొప్పున రూ. 18లక్షలకు దక్కించుకున్నారు.
సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన బహిరంగ వేలంతో రాజీవ్ స్వగృహ ప్లాట్ల నుంచి ప్రభుత్వానికి రూ. 1కోటి 23 లక్షల ఆధాయం వచ్చింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ వేలంలో ప్లాట్లు సొంతం చేసుకున్న లబ్దిదారులు 90 రోజుల్లో డబ్బులు చెల్లించాలన్నారు. మూడు వాయిదాల్లో డబ్బులు చెల్లించవచ్చని, ఒకే వాయిదాలో మొత్తం చెల్లిస్తే 2 శాతం రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరోవైపు మరో విడతలతో మిగిలిన ప్లాట్లను ప్రభుత్వ ఆదేశాలతో మరోసారి వేలం వేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్, డీఏఓ మహేష్ గౌడ్, మనోహా టౌన్ షిప్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

