హోంగార్డును ప్రశంసించిన హైకోర్టు చీఫ్ జస్టీస్
– కారు దిగి స్వయంగా అభినందనలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఓ ట్రాఫిక్ హోంగార్డు అంకితభావానికి ముగ్దులయ్యారు. తన కారు దిగి హోంగార్డుకు పుష్పగుచ్చం అందించీ మరీ అభినందించారు. ఈ సంఘటన శుక్రవారం హైదరాబాద్ అబిడ్స్‌లోని బాబు జగ్జీవన్‌రాం విగ్రహం వద్ద చోటు చేసుకుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ప్రతి రోజు తన అధికారిక నివాసం నుంచి హైకోర్టుకు అబిడ్స్ మీదుగా వెళ్తుంటారు. అదే మార్గంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ట్రాఫిక్ హోంగార్డ్ అష్రఫ్ అలీ(5066, అబిడ్స్ పీఎస్) విధులు నిర్వర్తిస్తుంటాడు. ప్రతి రోజు అష్రఫ్ తన విధులను చిత్తశుద్ధితో నిర్వహించడాన్ని చీఫ్ జస్టిస్ గమనించేవారు. ఈ క్రమంలో అతని అంకిత భావమే సీజే సతీశ్ చంద్ర శర్మను ముగ్దున్ని చేశాయి. దీంతో శుక్రవారం ఉదయం తన కాన్వాయ్‌ను బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఆపారు. హోంగార్డ్ అష్రఫ్ అలీకి పుష్పగుచ్ఛం అందించి, అభినందించారు. అష్రఫ్ అలీ పనితీరును మెచ్చుకుంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశంసలు కురిపించారు.

