కోచింగ్ రెడీ.. కోలువులు కొట్టండి..!
– 18 నుంచి తాండూరులో ఉచిత శిక్షణ శిబిరం
– విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం
– కానిస్టేబుల్, గ్రూపు 1,2,3,4 అభ్యర్థులు అర్హులే
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉచిత అందించే కోచింగ్‌ను సద్వినియోగం చేసుకుని కోలువులు సాధించాలని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వేదికగా స్థానిక నిరుద్యోగులకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తీపికబురు అందించారు. ఈనెల 18 నుంచి తాండూరులో పోలీస్ కానిస్టేబుల్, గ్రూపు 1,2,3,4తో పాటు టెట్ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ అందిస్తున్నట్లు ప్రకటించారు. పోలీసు యంత్రాంగంతో కలిసి తాండూరు పట్టణం పెద్దేముల్ రోడ్డు మార్గంలోని మెట్రో ఫంక్షన్ హాల్‌లో 90 రోజుల శిక్షణ శిబిరాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరాన్ని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, జిల్లా ఎస్పీ కోటిరెడ్డిలతో కలిసి ప్రారంభించోతన్నట్లు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన భాగ్య కిరణ్ ఫ్యాకల్టీ ద్వారా ఈ కోచింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. శిక్షణ తరువాత ఉచితంగా స్టడీ మెటిరీయల్ అందజేయడం జరుగుతుందన్నారు.

ప్రతి రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటలకు శిక్షణ శిబిరం కొనసాగుతుందన్నారు. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే 650 దరఖాస్తులు అందినట్లు వివరించారు. మొత్తం 1000 దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీ, పోలీసు యంత్రాంగం, తన సహాకారంతో నిర్వహించే ఉచిత కోచింగ్‌ను నిరుద్యోగ అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని కోలువులు సాధించాలని ఆకాంక్షించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ 90 వేల ఉద్యోగాలను ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగవకాశాలకు పెద్ద పీట వేసిందని గుర్తుచేశారు. తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐలు రాజేందర్ రెడ్డి, రాంబాబులతో కలిసి ఉచిత కోచింగ్ సెంటర్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

