దిమ్మె దుమారం..!
– పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్టాపన దిమ్మె కూల్చివేత
– మండిపడిన తాండూరు గౌడ సంఘం నాయకులు
– మున్సిపల్ టీపీఎస్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహా ఏర్పాటు కోసం నిర్మించిన దిమ్మెలను కూల్చివేయడం దుమారానికి దారితీసింది. పట్టణంలోని వినాయక్ చౌక్ సమీపంలోని పోటీ మహారాజ్ దేవాలయం ముందు ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్టావన కోసం ఏర్పాటు చేసిన దిమ్మెను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు.
ఈ విషయంతెలుసుకున్న గౌడ సంఘం అధ్యక్షులు రాజుగౌడ్, సంఘం పెద్దలు విశ్వనాథ్ గౌడ్, సంగం రవీందర్ గౌడ్, గీత కార్మిక సంఘం అధ్యక్షులు హరిహరగౌడ్, ప్రభాకర్ గౌడ్, యువనాయకులు సుమిత్ గౌడ్, సంతోష్ గౌడ్, సుదర్శన్ గౌడ్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డిలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాపన్న గౌడ్ విగ్రహా ప్రతిష్టాపన కోసం ఏర్పాటు చేసిన దిమ్మెను కూల్చడం దుర్మార్గమన్నారు. కుట్రపూరితంగా అనుమతులు లేవంటూ కూల్చివేయడం మంచిది కాదని మండిపడ్డారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి ఓ రౌడీషీటర్ మాటలు విని దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపించారు. గతంలోనే విగ్రహా ఏర్పాటు కోసం మున్సిపల్‌కు తీర్మానం అందించామని గుర్తుచేశారు. రేపే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం.. దమ్ముంటే అపాలంటూ కదం తొక్కారు. వెంటనే మున్సిపల్ టీపీఎస్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాండూరు గౌడ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
మరో దిమ్మెను కూల్చివేసిన అధికారులు
మరోవైపు జరిగిన సంఘటనపై అధికారులు మాట్లాడుతూ విగ్రహా ఏర్పాటుకు అనుమతులు కారణంగా దిమ్మెలను కూల్చివేసినట్లు తెలిపారు. పాపన్న గౌడ్ విగ్రహా దిమ్మెను మాత్రమే కాకుండా పట్టణంలోని శాంత్ మహాల్ చౌరస్తా సమీపంలో ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోష్ విగ్రహా ప్రతిష్టాపన దిమ్మెను కూడ కూల్చివేసినట్లు చెప్పుకొచ్చారు.


