దిమ్మెలపై దౌర్జన్యమెందుకు..?
– మహనీయుల పట్ల అగౌరవం హేయం
– నల్ల బ్యాచ్లతో బీసీ సంఘం నాయకుల నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి: మహనీయుల విగ్రహాల కోసం ఏర్పాటు చేసిన దిమ్మెలపై అధికారులు దౌర్జన్యం ప్రదర్శించడం తగదని బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వినర్ రాజ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాండూరు పట్టణ పరిధిలో స్వాతంత్ర సమర యోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్, బహుజన హక్కుల కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాల ఏర్పాటు కోసం నిర్మించిన దిమ్మెలను కూల్చడం పట్ల శుక్రవారం రాజ్ కుమార్ ఆధ్వర్యంలో సంఘం జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, నియోజకవర్గ మరియు పట్టణ యువజన సంఘం అధ్యక్షులు బోయ రాధాకృష్ణ, బోయ నరేష్, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్, సోషల్ మీడియా ఇంచార్జ్ బస్వరాజ్, బిసి నాయకులు మంతన్ గౌడ్ అశోక్, రాము ముదిరాజ్, మతిన్, సమృద్ధి, సయ్యద్, రాజు తదితరులు ఖండించారు. దిమ్మెలను కూల్చిన ప్రాంతాలను సందర్శించి నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్‌తో పాటు పలువురు మాట్లాడుతూ మహనీయుల కోసం ఏర్పాటుచేసిన దిమ్మలను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడం హేయమన్నారు. అధికారుల తీరు సరైంది కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కూల్చివేతలకు పాల్పడిన అధికారులపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

