తాండూరు డివిజ‌న్‌లో మ‌రో స‌ర్పంచ్ ఔట్‌

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు డివిజ‌న్‌లో మ‌రో స‌ర్పంచ్ ఔట్‌
– అల్లాపూర్ గ్రామ సర్పంచ్ నందినిపై వేటు
– నిధుల దుర్వినియోగం పట్ల సస్పెన్షన్
– రూ.6.50 లక్షల నిధులలో అవకతవకలు
-ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రో గ్రామ పంచాయ‌తీ స‌ర్పంచ్ విధుల్లో నుంచి ఔట్ అయ్యారు. నియోజ‌క‌వ‌ర్గంలోని బషీరాబాద్ మండ‌ల కేంద్ర స‌ర్పంచ్‌పై వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ వేటు వేసిన విష‌యం తెలిసిందే. తాజాగా తాండూరు మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ పై జిల్లా కలెక్టర్ కె. నిఖిల సస్పెన్షన్ వేటు వేశారు. పంచాయతి నిధుల వినియోగంలో అవకతవకలు, దుర్వినియోగానికి పాల్పడడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అల్లాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నందిని కొనసాగుతున్నారు. పంచాయతీ నిధుల వినియోగంలో ఆమె దుర్వినియోగానికి పాల్పడుతున్నారని గ్రామ వార్డు సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై తాండూరు మండల పంచాయతీ అధికారి పంచాయతీని సందర్శించి విచారణ జరిపారు. ఇందులో రూ. 8 లక్షల 5వేల 760లు, మరో రూ.2 లక్షల 66 వేల 933ల నిధులలో అవకతవకలకు పాల్పడినట్లు జిల్లా కలెక్టర్ కు నివేధిక అందించారు. దీనిపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె. నిఖిల పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం పంచాయతీ సర్పంచ్ నందినికి సోకాజ్ నోటీసు జారీ చేశారు. షోకాజ్ నోటీసులు అందుకున్న సర్పంచ్ నందిని జిల్లా కలెక్టర్ కు సంజాయిషీ ఇచ్చుకున్నారు. అయితే ఈ సంజాయిషీ నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వడంతో పాటు స్టాక్ రిజిస్టర్, సంబంధిత రికార్డులను సమర్పించలేదని కలెక్టర్ నిర్ధారించారు. అదేవిధంగా ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో విఫలం కావడం, ఆర్థిక అంశాలలో రూ. 6లక్షల 50 వేల 651ల నిధులలో దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. దీంతో పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 37(6) ప్రకారం సర్పంచ్ నందినిపై ఆరు మాసాలు సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను ఎంపీడీఓ అమలు చేయాలని ఆదేశించారు. ఈమేరకు అల్లాపూర్ సర్పంచ్ నందిని సస్పెండ్ వేటుకు గురయ్యారు. ఈ వ్యవహారం తాండూరు మండలంలో చర్చనీయాంశంగా మారింది.