అర్హులందరికి ఆరు గ్యారెంటీలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అర్హులందరికి ఆరు గ్యారెంటీలు..!
– జవాబుదారి పెంచేందుకే ప్రజా పాలన
– విజయవంతం పూర్తి బాధ్యత అధికారులదే
– ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలోని అర్హులందరికి ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు సర్కారు కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి 100 రోజల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చేందుకు గురువారం ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపడుతుందని అన్నారు. అర్హులైన లబ్దిదారులు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరించి విజయవంతం చేసే బాధ్యత అధికారులదే అని అన్నారు. అధికారులతో పాటు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, చైర్ పర్సన్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు భాగస్వాములు కావాలన్నారు. దరఖాస్తుల స్వీకరణకు ముందు సీఎం రేవంత్ రెడ్డి సందేశం వినిపించాలన్నారు. అదేవిధంగా లబ్దిదారులు దరఖాస్తులు సమర్పించే సమయంలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్సులు అందించాలన్నారు. రేషన్ కార్డు లేకున్నా ఆధార్ కార్డు అందించాలన్నారు. దరఖాస్తులు సమర్పించిన తరువాత రసీదులు పొందాలన్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న లబ్దిదారులకు సమాచారం అందించాలని, వాళ్లకు అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు.

అర్హులైన ప్రతీ ఒక్క లబ్దిదారులకు ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలన్నారు. ధరఖాస్తు ఫారాలను డబ్బులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు రాకుండా శ్రద్ధ వహించాలన్నారు. ప్రజా పాలనను జయప్రదం చేసి సీఎం రేవంత్ రెడ్డికి, జిల్లాకు మంచి పేరు తీసుకరావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, ఎంపీపీ అనితా రవీందర్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, బషీరాబాద్ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటి చైర్ పర్సన్ వీణ శ్రీనివాస్, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నామల నర్సింలు, పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం