ప్రభుత్వ స్థలం కబ్జా
– దర్జాగా దారి చేసుకుంటున్న అక్రమార్కులు
– నిద్రమత్తులో పట్టించుకోని అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతోంది. కన్నేసిన అక్రమార్కులు స్థలంలో దర్జాగా దారి వేసుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు నిద్రమత్తులో జోగుతూ పరిరక్షణను గాలికొదిలేశారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు మున్సిపల్ పరిధి సాయిపూర్‌లోని భవాని నగర్‌లో ప్రభుత్వం స్థలం ఉంది. ఈ స్థలంలోని భవనంలో కొన్నేండ్ల క్రితం ప్రభుత్వ యూనానీ ఆసుపత్రిని నిర్వహించారు. ఆ తరువాత ఈ ఆసుపత్రిని పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఈ స్థలంపై కొందరు అక్రమార్కులు కన్నేశారు. ఇప్పటికే ఆ భవనం చుట్టు ఉన్న కొంత స్థలం కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. తాజాగా భవనం పరిసర ప్రాంతంలో పారుతున్న మురుగుపై కొందరు నాపరాతి వ్యర్థాలను వేసి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. రియల్ ఏస్టేట్ వ్యాపారులే ఈ కబ్జాకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పక్కనే ఉన్న ప్రైవేటు స్థలం వ్యక్తులు వారి వెంచర్‌లోకి వేళ్లేందుకు దర్జాగా ఈ దారిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ విషయంపై స్థానికులు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చెరనుంచి విడిపించాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా స్థలం కబ్జాపై గతంలో ఫిర్యాదులు అందాయని, దీనిపై చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ అధికారులు పేర్కొన్నారు. అయినా కూడ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని వేచి చూడాలి.

