కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
– దర్యాప్తు జరుపుతున్నపోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తాండూరు పట్టణ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని మల్ రెడ్డిపల్లికి చెందిన మిట్టి గుండప్ప(36) కూలీ పనులు చేస్తూ భార్య, పిల్లలతో జీవనం సాగించేవాడు. గత కొంత కాలంగా గుండప్ప కుటుంబ కలహాలతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో అతని భార్య అతన్ని వదిలి తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన గుండప్ప శుక్రవారం ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల ద్వార విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. కుటుంబీకులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
కింది వరకు చూడండి…


