సమస్యల పరిష్కారమే పట్టణ ప్రగతి లక్ష్యం
– అందరి సమన్వయంతోనే విజయవంతం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– మున్సిపల్ ఉత్సహాంగా పట్టణ ప్రగతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం తాండూరు మున్సిపల్ పరిధి 8, 13, 14, 20వ వార్డులలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయా వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం ఉత్సహాంగా కొనసాగింది. 8వ వార్డులోని రాజీవ్ కాలనీలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, వార్డు కౌన్సిలర్‌తో కలిసి క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆయా వార్డుల్లో కౌన్సిలర్లు, అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వార్డుల్లో మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం ఇండ్ల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. రోడ్లు పై ఉన్న విద్యుత్ స్థంబాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. మురుగు కాలువలు, రోడ్లు శుభ్రం చేయించాలని, ఖాళీ స్థలాలలో పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. పట్టణ ప్రగతిలో గుర్తించిన ప్రతి సమస్యను పరిష్కరించాలని అన్నారు. అందరు సమన్వయంతో భాగస్వాములైతేనే పట్టణ ప్రగతి విజయవంతం అవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం), కౌన్సిలర్లు వెంకన్నగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, బొంబీనా, సంగీత ఠాకూర్, టీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, టీఆర్ఎస్ కార్యదర్శి సంతోష్ గౌడ్, నాయకులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

