మానవత్వంతో సేవలందించండి
– ప్రతి కోవిడ్ గర్భిణీకి ప్రసవాలు చేయండి
– వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతారెడ్డి
– జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్‌కు ఆదేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కరోనా సమయంలో ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి మానవత్వంతో వైద్య సేవలు అందించాలని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో జెడ్పీ పర్సన్ సునితారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ గుప్తతో కలిసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవిశంకర్, ఆసుపత్రి అభివృద్ధి కమిటి సభ్యులు డాక్టర్ రమణబాబుతో సమీక్ష నిర్వహించారు. జిల్లా ఆసుపత్రితో పాటు హైదరాబాద్ రోడ్డుమార్గంలోని మాతా శిశు ఆసుపత్రి(ఎంసీహెచ్)లో రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రులలో రోగులను దృష్టిలో ఉంచుకుని పరిశుభ్రత పాటించాలన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి కార్పోరేట్ తరహా వైద్యం అందించాలన్నారు. ముఖ్యంగా కరోనా తరుణంలో ఎంసీహెచ్ ఆసుపత్రిలో ప్రసవాలను కొనసాగించాలన్నారు. కోవిడ్ సోకిన ప్రతి గర్భిణీకి సేవలందించేందుకు వెనుకాడవద్దని అన్నారు. మానవత్వంతో ప్రసూతి సేవలను అందించాలని ఆదేశించారు. మరోవైపు ఎంసీహెచ్ ఆసుపత్రిలో ఇప్పటి వరకు దాదాపు 30 మంది గర్భిణీలకు ప్రసూతి సేవలను అందించడం జరిగిందని సూపరిండెంట్ డాక్టర్ రవిశంకర్ వివరించడంతో జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డి అభినందించారు.

