సూపర్ జావిద్..!
– సీసీ కెమెరాలకు తోడ్పాటు అభినందనీయం .
– ప్రశంసించిన జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : సొంత ఖర్చులతో సీసీ కెమెరాల ఏర్పాటుకు తోడ్పాటు అందించడం అభినందనీయమని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తాండూరు టీఆర్ఎస్ యువనాయకుడు జావిద్ హుస్సేన్‌ను అభినందించారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని రాజీవ్ కాలనీకి చెందిన టీఆర్ఎస్ యువనాయకుడు జావిద్ హుస్సేన్ రాజీవ్ కాలనీతో పాటు ఇందిరమ్మ కాలనీలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందజేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు రెండు కాలనీలో 15 కెమెరాలను ఏర్పాటు చేసేందుకు సహాకారం అందించారు. ఇందుకోసం జావిద్ హుస్సేన్ సొంతంగా రూ. 1లక్ష 50 వేలను విరాళంగా అందజేశారు. బుధవారం యాలాల పోలీస్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హాజరై జావిద్ ను అభినందించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకారం ప్రశంసనీయమని అన్నారు. జావిద్‌ను సన్మానించి.. అతన్ని ఆదర్శంగా తీసుకుని దాతలు ముందుకురావాలని, సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్, తాండూరు రూరల్ సీఐ రాంబాబు, యాలాల ఎస్ఐ అరవింద్, నాయకులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



