ప్రభుత్వ పంతుళ్లకు పిడుగు వార్త..!
– ఆస్తుల వివరాలు సమర్పించాలని సర్క్యూలర్
– ఇక నుంచి కొనాలన్నా.. అమ్మాలన్నా చెప్పాల్సిందే
– ఉత్తర్వులలో స్పష్టం చేసిన విద్యాశాఖ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధిః తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు సర్కారు పిడుగులాంటి వార్త చెప్పింది. ఇప్పటి నుంచి ఆస్తుల వివరాలను పక్కాగా చెప్పాల్సిందే అంటూ షాకింగ్ ఉత్తర్వులను విద్యాశాఖ ద్వారా జారీచేసింది. ఇటీవల నల్గొండ జిల్లా దేవరకద్ర మండలం గుంటిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావీద్ అలీపై ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై టీచర్లు ఇళ్లు, ప్లాట్లు కొనాలన్నా..అమ్మాలన్నా సంబంధిత అధికారులకు చెప్పాలని సూచించించింది. కేవలం, ఇళ్లు, ప్లాట్ల లావాదేవీలే కాదు… బంగారం, ఆభరణాలు, ఇతర ఖరీదైన వస్తువులు ఏమైనా కొనాలన్నా సంబంధిత అధికారికి వివరాలు సమర్పించాల్సిందే. యేడాదికోసారి ఆస్తుల వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. లేదంటే, ఆయా టీచర్స్‌పై చర్యలు ఉంటాయని హెచ్చరిచ్చింది. ఇందుకు సంబంధించి టీచర్లు, ఉద్యోగులకు ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వాలని ఆర్జేడీ, డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
సర్క్యూలర్ సారంశమేంటంటే..
– టీచర్లంతా ఏడాదికోసారి ఆదాయం లెక్కలు చూపించాల్సిందే
– స్థిర, చర ఆస్తులు అమ్మినా, కొన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి
– ఇండిపెండెంట్ ఇల్లు, ఫ్లాట్, షాప్, నివాసస్థలం, వ్యవసాయభూమి కొన్నా అమ్మినా అనుమతి తీసుకోవాల్సిందే
– తన పేరుమీద, కుటుంబీకుల పేరు మీద కొన్నాసరే లెక్కలు చూపించాలి
– కొనడానికి తగిన ఆదాయవనరు లెక్కలు చూపించాలి..
– APCS (1964) సర్వీస్ రూల్స్ 9లోని సబ్‌రూల్‌ను గుర్తు చేసిన సర్క్యూలర్
ఏయే వివరాలు సమర్పించాలంటే..
– కారు, మోటార్‌సైకిల్, ఇతర వాహనం ఏది కొన్నా చెప్పాల్సిందే
– ఏసీ, టీవీ, వీసీఆర్, ఫ్రిజ్.. ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏం కొన్ని చెప్పాల్సిందే
– బంగారం, వెండి, ఆభరణాలు, పాత్రలు ఏం కొన్నా చెప్పాల్సిందే
– బ్యాంక్ డిపాజిట్స్, బ్యాంక్ బ్యాలెన్స్‌లు, ఇతర పెట్టుబడుల గుట్టు విప్పాల్సిందే



