ఈజీగా డ్రైవింగ్ లెసెన్స్..!

జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

ఈజీగా డ్రైవింగ్ లెసెన్స్..!
– ఆఫీసుకు వెళ్ల‌కుండానే జారీకి అవ‌కాశం
– జారీ ప్ర‌క్రియ‌లో కీల‌క మార్పులు చేస్తున్న ప్ర‌భుత్వం
ద‌ర్శిని డెస్క్‌: వాహ‌నాలు న‌డిపే వారికి డ్రైవింగ్ లైసెన్స్ త‌ప్ప‌నిస‌రి. దీనిని పొందేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చేంది. ఇక‌పై అలాంటి క‌ష్టాల‌కు కాలం చెల్లిపోతోంది. ఇకపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ఆర్టీవో (రీజ‌న‌ల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్) ఆఫీసుల్లోకి అడుగుపెట్టకుండానే డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందవచ్చు.
ఇంతకుముందు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ముందు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.. ఆ తర్వాత దగ్గర్లోని ఆర్టీవో ఆఫీసు వద్దకు వెళ్లాలి. ఆ తర్వాత ఆక్కడ అధికారులు సూచించిన ప్రకారం డ్రైవింగ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. అందులో సక్సెస్ అయితే..ముందుగా లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్‌ అందిస్తారు. ఆ తర్వాత 90 రోజులు లేదా అంతకంటే తక్కువ సమయంలో డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ఇందులో పాసైతే శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్‌ను అందిస్తారు.

అయితే కేంద్ర జాతీయ ర‌హ‌దారుల‌, ర‌వాణా శాఖ కొత్త నిబంధ‌న‌ల‌ను అందుబాటులోకి తీసుక‌వ‌స్తోంది. ఈ మేర‌కు ఉత్త‌ర్వుల‌ను కూడ జారీ చేసింది. గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్ల నుంచి ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చని అందులో పేర్కొంది. ఈమేరకు అధికారులు చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. డ్రైవింగ్ శిక్షణ పొందిన వారు అక్రిడిటేడ్ డ్రైవ‌ర్ ట్రైనింగ్ సెంట‌ర్ల నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందవచ్చు. ఇందుకోసం ఆయా సంస్థల్లో డ్రైవింగ్ శిక్షణ కోసం నమోదు చేసుకోవాలి. సక్సస్‌ఫుల్‌గా శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం, డ్రైవింగ్ టెస్టులో పాసైతే, వారికి ఆయా సంస్థలు డ్రైవింగ్ లైసెన్స్ అందిస్తాయి. లైట్ (ఎల్ఎంవీస్‌), మీడియం, హెవీ వెహిక‌ల్స్ (హెచ్ఎంవీస్‌)‌లకు డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందాలన్నా.. అక్రిడేటెడ్ డ్రైవ‌ర్ ట్రైనింగ్ సెంట‌ర్లే ట్రైనింగ్ ఇస్తాయి. కాగా, లైట్ మోటార్ వెహిక‌ల్స్ డ్రైవింగ్ శిక్షణ 29 గంట‌ల సమయం ఉంటుంది. శిక్షణ ప్రారంభించిన నాలుగు వారాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఆర్టీసీ కార్యాలయం నుంచి పొందే డ్రైవింగ్ లైసెన్స్‌ల‌కు బిన్నంగా ఎలాంటి టెస్ట్ లేకుండానే ట్రైనింగ్ స‌ర్టిఫికెట్‌తో డ్రైవింగ్ లైసెన్స్ అందుకోవచ్చు. కాకపోతే, ఆయా ట్రైనింగ్ సెంటర్లలో స్టిమ్యులేట‌ర్లు, డెడికేటెడ్ టెస్ట్ ట్రాక్‌ల‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలని ప్రభుత్వం స్ప‌ష్టం చేసింది. మ‌రోవైపు ఈ కొత్త రూల్స్‌పై కొన్ని రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ ప్రైవేటు వ్యక్తులకు అందిస్తే, చాలా నష్టాలు జరుగుతాయని వాదిస్తున్నాయి. ఎలాంటి శిక్షణ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తాయ‌ని ఆరోపిస్తున్నారు.