పదిలో మెరుగైన ఫలితాలే లక్ష్యం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పదిలో మెరుగైన ఫలితాలే లక్ష్యం..!
– 100శాతం ఉత్తీర్ణతకు ప్రత్యేక దృష్టిసారించాలి
– వికారాబాద్‌ జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి
– ఉపాధ్యాయులతో సమావేశం, స్కూళ్ల సందర్శన
తాండూరు, దర్శిని ప్రతినిధి : పదో తరగతిలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని వికారాబాద్‌ జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి అన్నారు.

బుధవారం తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో నియోజవర్గంలోని పెద్దేముల్, తాండూరు, యాలాల, బషీరాబాద్‌ మండలాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన విద్యాధికారి రేణుకా దేవి మాట్లాడుతూ పదో తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ద వహించి మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు శ్రమించాలని అన్నారు.

ఈ సారి వార్షిక పరీక్షల్లో అన్ని పాఠశాలలో విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించేందుకు దృష్టిసారించాలని అన్నారు. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు అల్పహారం అందించాలని సూచించారు. మరోవైపు బషీరాబాద్ మండలంలో జిల్లా విద్యాధికారిణి రేణుకా దేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర, కేజీబీవీ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులను ప్రశ్నలు అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రాజెక్ట్ కాపీలు, గ్రాండ్ టెస్ట్ జవాబు పత్రాలను పరిశీలించి ఇంకా మెరుగ్గా ఫలితాలు వచ్చే విధంగా కృషి చేయాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో మండల విద్యాధికారులు, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కేజీబీవీ ప్రత్యేక అధికారి సునీత తదితరులు ఉన్నారు.

కాలనీలో చీకట్ల ఇబ్బందులు దూరం