ప్రాణం తీసిన పాత కక్ష్యలు
– కోపంతో కర్రతో దాడి, చికిత్సకు తరలిస్తుండగా మృతి
– మృతికి కారకులైన నలుగురిపై కేసు నమోదు
– బషీరాబాద్ జమ్లానాయక్ తాండాలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇరు కుటుంబాల మద్య ఉన్న పాత కక్ష్యలు ఓ మనిషి ప్రాణాలు తీశాయి. కోపంలో కర్రదాడి చేయడంతో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమద్యలోనే కన్నుమూశాడు. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలం జమ్లా నాయక్ తాండాలో చోటు చేసకుంది. బషీరాబాద్ ఎస్ఐ అన్వేష్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండాకు చెందిన రాథోడ్ సూర్య నాయక్ (50) భార్యను గత రెండు నెలల క్రితం జరిగిన ఓ జాతరలో అదే తాండాకు చెందిన ఛవాన్ రాము దాడి చేశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు విచారణ జరిపి రాముపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో చవాన్ రాము మనసులో కక్ష్య పెంచుకున్నాడు. బుధవారం రాత్రి 10 గంటలకు రాథోడ్ సూర్య నాయక్ ఇంటి దగ్గర ఉన్న ఓ కిరాణా దుకాణం దగ్గర ఛవాన్ రాము, ఛవాన్ శ్రీను, ఛవాన్ మల్లేష్, ఛవాన్ రాములు కలిసి కూల్ డ్రింక్స్ తాగుతూ సూర్యనాయక్‌ను అకారణంగా దూషించారు. దీంతో ఇరువురు మద్య తగాదాలతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో ఛవాన్ శ్రీను సూర్యా నాయక్‌పై కోపంతో కర్రతో దాడి చేశాడు. సూర్య నాయక్‌కు బలమైన గాయడం కావడంతో తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాండాలో జరిగిన విషయాన్ని స్థానికులు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. ఆసుపత్రిలో సూర్య నాయక్ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి మెరుగైన చికిత్స నిమిత్తం తరలించారు. గురువారం ఉదయం చికిత్స పొందుతూ సూర్య నాయక్ మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఐ. అన్వేష్ రెడ్డి తెలిపారు.



