తెలంగాణ సాధనలో ఆచార్య ఆశయాలు చిరస్మరణీయం
– చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి
– తాండూరులో ఘనంగా జయంతి, నేతల నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సాధనలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయాలు చిరస్మరణీయమని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి అన్నారు.

గురువారం జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో చిత్రపటానికి, పట్టణంలో ఇందిరా చౌరస్తా వద్ద జయశంకర్ సార్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజబాల్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆచార్య జయశంకర్ అందించిన భావజాలం, చేసిన త్యాగాలు, చూపిన మార్గం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుల్లో ఆచార్య జయశంకర్ ఒకరని పేర్కొన్నారు. ఆయన సేవలను చిరకాలం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


