భూ రిజిస్ట్రేషన్‌ ఆపకపోతే ఇప్పుడే చస్తాం

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

భూ రిజిస్ట్రేషన్‌ ఆపకపోతే ఇప్పుడే చస్తాం
– పురుగుల మందు డబ్బాతో బాధితుల హల్‌చల్
– యాలాల తహసీల్దార్‌ కార్యాలయంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: మాకు చెందాల్సిన భూమికే కొందరు అక్రమార్కులు ఎసరు పెడుతున్నారని ఓ గ్రామ సర్పంచ్‌ తల్లి, బాధిత కుటుంబ సభ్యులు మండి పడ్డారు. భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ చేస్తే ఇప్పుడే చస్తామని తహసీల్దార్‌ కార్యాలయంలో వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాతో హల్‌ చల్ చేశారు. ఈ సంఘటన గురువారం వికారాబాద్‌ జిల్లా యాలాల మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మండలంలోని లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన డబ్బ వెంకటమ్మ కుమారుడు నర్సింహా గ్రామ సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. వెంకటమ్మ భర్త రాములు చాలా రోజుల క్రితం మరణించారు. అయితే 2000 సంవత్సరంలో లక్ష్మీనారాయణపూర్‌ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 9లో 3 ఎకరాల 2 గంటలు, సర్వే నెంబర్ 11లో 10 గుంటల భూమికి కొనుగోలు చేశారు. అప్పట్లో వారు ఈ భూమిని తమ పేరుపై మోటేషన్ చేసుకోలేదు. ఇటీవల భూమిని విక్రయించిన వ్యక్తి తాండూరుకు చెందిన పవన్‌ కుమార్ సోని అనే వ్యక్తికి మళ్లీ విక్రయించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసి బాధిత కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన పలు పత్రాలు కూడ బాధితులకు అందాయి. కాని ఆ భూమిని డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు వ్యాపారి తహసీల్దార్ కార్యాలయంలో స్లాట్ బుక్ చేసుకున్నారని ఆందోళన చెంది కార్యాలయానికి వచ్చారు. సర్పంచ్ తల్లి వెంకటమ్మ, సర్పంచ్ నర్సింలు, వెంకటమ్మ మరిది మానవ హక్కుల సంఘం ప్రతినిధి అరవింద్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని భూమిని డబుల్ రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని తహసీల్దార్, అధికారులతో వాదనకు దిగారు. దళితులకు దక్కాల్సిన భూమిని రిజిస్ట్రేషన్ చేసి అన్యాయం చేస్తారా అంటూ మండిపడ్డారు. భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే ఇక్కడే చస్తామని వెంట తీసుకువచ్చిన పురుగుల మందు డబ్బాతో హల్‌ చల్ చేశారు. అన్యాయం చేస్తే చస్తామని హంగామా చేశారు. అక్కడే ఉన్న అధికారులు అప్రమత్తమై పురుగుల డబ్బాను లాగేసుకున్నారు. వెంటనే తహసీల్దార్ గోవిందమ్మ స్పందిస్తూ ఈ సర్వే నంబర్ల యొక్క సమాచారాన్ని కలెక్టర్‌కు నివేధిక అందిస్తామని, అప్పటి వరకు రిజిస్ట్రేషన్‌ నిలిపి వేస్తామని చెప్పినట్లు బాధితులు మీడియాతో తెలిపారు.