కెమికల్స్‌తో కల్తీ అల్లం పేస్ట్‌..!

ఆరోగ్యం క్రైం తాండూరు వికారాబాద్

కెమికల్స్‌తో కల్తీ అల్లం పేస్ట్‌..!
– బ్రాండెడ్‌ పేరుతో అక్రమ దందా
– కేంద్ర సంస్థ గుర్తింపు అంటూ విక్రయాలు
– రూ. 1లక్ష విలువైన 20 క్వింటాళ్ల డబ్బాలు స్వాదీనం
– వివరాలను వెల్లడించిన తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి: పేద ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు కల్తీ వ్యాపారానికి పాల్పడుతున్నారు. ప్రజలు ఆహారానికి వినియోగించే అల్లంను కూడ వదిలేయడం లేదు. కెమికల్స్‌ ఉపయోగిం.. కుల్లిన అల్లంతోనే అల్లం పేస్టు తయారు చేసి అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. అదే తరహాలో తాండూరులో ఓ ప్రబుద్దుడు సాగిస్తున్న కల్తీ అల్లం పేస్టు వ్యాపారం గుట్టును రట్టు చేశారు. మంగళవారం తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ పట్టణ సీఐ రాజేందర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ హుమాయున్ నగర్ లోని ఆసిఫ్ నగర్‌కు చెందిన ఇమ్రాన్ సలీం వ్యాపారస్తుడుగా ఉన్నారు. చేస్తున్న వ్యాపారాలలో అధిక లాభాలను ఆర్జీంచేందుకు కల్తీ అల్లం పేస్టు వ్యాపారాన్ని ఎంచుకున్నారు. పెద్ద పెద్ద పట్టణాలలోనే లాభసాటిగా ఉంటుందని తాండూరు పట్టణాన్ని కూడ ఎంచుకున్నారు. ఇందులో భాగంగా పాత కూరగాయల మార్కెట్లో సయ్యద్ కలీం అహ్మద్ గోదాంను అద్దెకు తీసుకుని అందులో కల్తీ అల్లం పేస్టు వ్యాపారానికి తెరలేపాడు. గత నెల క్రితం వ్యాపారం నిర్వహించుకుని వెళ్లిపోయాడు. తాజాగా మరోసారి డబ్బాలను దిగుమతి చేసుకున్నాడు.

బయట పడింది ఇలా…
ఇమ్రాన్‌ సలీం తాండూరులో కల్తీ అల్లం పేస్తు వ్యాపారం చేస్తున్నాడని సమాచారం అందుకున్న వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఇను స్పెక్టర్ ఎం. వెంకటేశం అండ్ టీం నిఘా ఉంచారు. సోమవారం రాత్రి తాండూరు పట్టణ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ బృందంతో గోదాంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో హీనా జింజర్ అండ్ గార్లిక్ పేస్టు పేరుతో ఉన్న 100 గ్రాముల నుంచి 5 కిలోల వరకు ఉన్న డబ్బాలను స్వాదీనం చేసుకుని అదేరాత్రి పట్టణ పోలీస్టేషన్కు తరలించారు. మొత్తం డబ్బాలు దాదాపు 20 . క్వింటాళ్ల వరకు ఉండవచ్చని, వీటి విలువ రూ. 1లక్ష వరకు ఉంటుందని డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ తెలిపారు.

ఎలా విక్రయిస్తున్నాడంటే..
నిందుతున్ని అదుపులోకి తీసుకుని ప్రాథమికంగా విచారించగా ఈ డబ్బాలపై కేంద్ర సంస్థకు చెందిన గుర్తింపు, బ్రాండెడ్ పేరుతో విక్రయాలు చేపడుతున్నట్లు గుర్తించామని డీఎస్పీ శేఖర్ గౌడ్ వెల్లడించారు. అల్లం పేస్టు తయారికి కెమికల్స్ తో పాటు మక్కపిండి వినియోగిస్తున్నట్లు నిందితుడు తెలిపాడని వివరించారు. మార్కెట్లో బ్రాండెడ్ అల్లం పేస్టు అంటూ తక్కువ ధరకు విక్రయిస్తూ దందా చేస్తున్నాడని తెలిపారు. ఈ మేరకు నిందితుడిపై చీటింగ్ కేసుతో పాటు ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్టు 2006 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరోవైపు ప్రజలు కల్తీ అల్లం పేస్టు కొనుగోళ్లపై జాగ్రత్తగా ఉండాలని, కల్తీ అల్లం వినియోగంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు. ఇలాంటి కల్తీ వ్యాపారాల గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహిపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.