కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నగారా

జాతీయం తెలంగాణ హైదరాబాద్

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నగారా
– షెడ్యూల్‌ను ప్రకటించిన ఎన్నికల సంఘం
– తొలిసారిగా ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం
దర్శిని డెస్క్‌: కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు బుధవారం ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. సంఘం సీఈసీ రాజీవ్ కుమార్ ఎన్నికలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీ ఐదేళ్ల కాలపరిమితి 24 మే 2023తో ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల కోసం ఏప్రిల్ 13న నోటిఫికేషన్ విడుదల కానుంది.

మే 10 పోలింగ్, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఒకే దశలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ స్పష్టం చేశారు. ఇవాళ్టి నుంచే కర్ణాటకలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటుందని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో 80 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగ ఓటర్ల కోసం తొలిసారి ఓట్ ఫ్రమ్ హోం ప్రవేశపెట్టబోతున్నట్లు రాజీవ్ కుమార్ ప్రకటించారు. కర్ణాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ సంఖ్యాబలం 119 కాగా కాంగ్రెస్‌కు 75, జేడీఎస్ కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం
224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో తొలిసారి ఓట్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తీసుకువచ్చింది. సీనియర్ సిటిజన్లు ఇంటినుంచే ఓటువేసే అవకాశాన్ని కల్పించింది. 80ఏళ్లు పైబడిన వృద్ధులు ఇంటి దగ్గరే బ్యాలెట్ విధానంలో ఓటు వేసే విధంగా వెసులుబాటు కల్పించారు. కర్ణాటకలో మొత్తం 5.21 కోట్ల ఓటర్లు ఉన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఓటింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.