సీల్డ్ కవర్.. సీన్.. మారితే..!
– ప్లాన్ బీ.. సిద్దం చేసిన అధిష్టానం
– అభ్యర్థులకు నిరాశ లేకుండా నిర్ణయం
– ఎప్పుడు.. ఎలా.. ప్రయోగించే టైం కూడా ఫిక్స్
వికారాబాద్, దర్శినిప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కొన్ని రోజుల్లో మొదలువున్న స్థానిక సమరంలో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కొత్త ఒరవడితో ముందుకు సాగుతోంది. వివిధ స్థానాలకు అభ్యర్థుల నుంచి పోటీ అధికమవుతున్న నేపథ్యంలో అధిష్టానం సీల్డ్ కవర్ ప్రయోగానికి సిద్దమైన సంగతి తెలిసిందే. స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీసీలుగా పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఇప్పటికే ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురు చొప్పున దరఖాస్తులు చేసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

ఎంపీటీసీ, సర్పంచుల, వార్డు సభ్యుల అభ్యర్థుల ఎంపికను దాదాపు ఇదే తరహాలో ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. రోజు రోజుకు ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో సీల్డ్ కవర్ ఎంపిక పట్ల ఆశావాహులు ఉత్కంఠకు గురవుతున్నారు. ఇందులో ఎవరు పేరు వస్తుందో.. ఎవరిది రాదో ఆనే ఆలోచనలతో సతమతమవుతున్నారు. అయితే కొత్త ఒరవడిలో భాగంగా సీల్డ్ కవర్ విధానంను కూడా పక్కాగా అమలు చేయాలని అధిష్టానం దృష్టిసారించింది. జెడ్పీటీసీ స్థానాలకు దరఖాస్తు చేసుకున్న ముగ్గురిలో ఒక్కరికే అవకాశం కల్పించాల్సి ఉంటుంది. మిగతా ఇద్దరిలో బలమైన నాయకుడు కూడా వుంటే వారిని ఎలా సముదాయించాలో ప్రణాళికలు సిద్దం చేసింది.

అభ్యర్థులను నొప్పించకుండా.. పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసేందుకు ప్లాన్ బీని కూడా సిద్దం చేసుకుంది అధిష్టానం. ఈ ప్లాన్ ఎప్పుడు.. ఎలా అమలు చేయాలో అనే విషయాన్ని కూడా సంసిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. జెడ్పీటీసీ బరిలో అభ్యర్థులు ఎక్కువగా ఉంటే ముందుగా అభ్యర్థులతో చర్చలు జరపాలని నిర్ణయించింది. ఇందులో ఏ ఒక్కరికి ఏకాభిప్రాయం కుదరకుంటే ఎలా ముందుకు సాగాలో అనే దానిపై కూడా మంత్రాన్ని సిద్దం చేసుకున్నట్లు సమాచారం. సీల్డ్ కవర్లో ఎంపిక చేసిన వారితో పాటు మిగతా వారు కూడా పోటీలో ఉంటే… అధిష్టానం నిర్ణయాన్ని పక్కన పెట్టి.. అందరు నామినేషన్లు వేసే వరకు అభ్యర్థుల ఎంపికను పెండింగ్లో ఉంచాలని నిర్ణయించింది. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు వరకు బుజ్జగింపులు జరిపి.. చివరకు ఒక్కరు మాత్రమే బరిలో ఉండే విధంగా చూడాలని పాచికలు వేసింది. ఈ నిర్ణయం తరువాత ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.

ఇదికూడా చదవండి…

