సెలవులు పొడగింపు..!
– ఆలస్యంగా స్కూళ్ల పునఃప్రారంభం
– ప్రకటించిన రాష్ట్ర విద్యాశాఖ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవులు పొడగించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి వేసవి సెలవులు ముగిసి.. ఈనెల 12వ తేది నాటికి పాఠశాలలు తెరుచుకోవాల్సి ఉంది.

కాని పాఠశాలలను ఈనెల 12వ తేదీకి బదులు 15న పునః ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈనెల 13న రెండో శనివారం, 14న ఆదివారం కావడంతో వేసవి సెలవులు పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈనెల 12వ తేదీన సెలవు ఇచ్చినందున.. విద్యా సంవత్సరం నష్టపోకుండా జులై 11న రెండో శనివారం తరగతులు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.

ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 227 పనిదినాలు ఉంటాయి. ఏప్రిల్ 23, 2027 విద్యాసంవత్సరపు చివరి పనిదినంగా ఉంటుంది. ఏప్రిల్ 24, 2027 నుండి జూన్ 13, 2027 వరకు వేసవి సెలవులుగా ప్రకటించారు. అక్టోబర్ 10, 2026 నుండి అక్టోబర్ 22, 2026 వరకు మొత్తం 13 రోజులు దసరా సెలవులు ఉంటాయి.

జనవరి 13, 2027 నుండి జనవరి 17, 2027 వరకు 5 రోజులు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ 23 నుండి 27 వరకు 5 రోజుల పాటు క్రిస్మస్ సెలవులు ఉంటాయి. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు పరీక్షల తేదీలను కూడా ముందే ఖరారు చేశారు.



