లైసెన్స్‌ రూల్స్ వెరీ స్ట్రిక్ట్..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ వికారాబాద్ హైదరాబాద్

లైసెన్స్‌ రూల్స్ వెరీ స్ట్రిక్ట్..!
– కొత్త గైడ్‌లైన్స్‌ తెచ్చిన రవాణా శాఖ
– ఏజెంట్లు, బ్రోకర్ల ప్రమేయానికి చెక్‌
– అభ్యర్థి పాటించాల్సిన నియమాలు ఇవే
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఇకపై డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే కఠినమైన నిబంధనలు ఎదుర్కొవాల్సిందే. రవాణా శాఖలో లైసెన్స్‌ జారీ పట్ల జరుగుతున్న అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్ట్రిక్ట్ రూల్స్‌ను ప్రవేశ పెడుతోంది.

తెలంగాణవ్యాప్తంగా వివిధ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు, ఆర్టీఓ కార్యాలయాలలో దరఖాస్తుదారులు రాకుండానే లైసెన్సులు జారీ చేయడం, ప్రైవేట్ ఏజెంట్లతో కుమ్మక్కవడం, తనిఖీ అధికారుల రాకపై రహస్య కోడ్‌లు ఉపయోగించడం వంటి తీవ్ర అవకతవకలు జరుగుతున్నట్లు ఏసీబీ తనిఖీల్లో తేలింది. దీంతో రవాణా శాఖ కొత్త గైడ్‌ లైన్స్‌ను జారీ చేసింది.

అభ్యర్థుల నిబంధనలు
డ్రైవింగ్ టెస్ట్ మార్గాన్ని పూర్తిగా పూర్తి చేయాలి. కేవలం స్టీరింగ్ ముందుకు కూర్చోవడం లేదా కొద్ది దూరం నడపడంపై ఇకపై కుదరదు. వాహనాన్ని ఆపడం, వెనక్కి నడపడం, లేన్ క్రమశిక్షణ, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం వంటి సామర్థ్యాలను ప్రదర్శించాలి. పరీక్ష సమయంలో సీసీటీవీ కెమెరాలు నిరంతరం పనిచేస్తూనే ఉండాలి.

ప్రతి పరీక్ష ముగియగానే ఫలితాలను రిజిస్టర్‌లో నమోదు చేసి, పరీక్షించిన అధికారి, ఇన్‌ఛార్జ్ సంతకాలు చేయాలి. బ్రోకర్లు, మధ్యవర్తులు, డ్రైవింగ్ స్కూల్ ప్రతినిధులను ట్రాక్ ప్రాంగణంలోకి అనుమతించకూడదు. ప్రవేశ ద్వారం వద్ద ఈ మేరకు నోటీసు బోర్డు పెట్టాలి. ఏజెంట్లతో చేతులు కలిపిన సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేస్తారు.

ఉద్యోగులకు హెచ్చరిక
సీనియర్ అధికారులు లేదా ఏసీబీ బృందాల రాకను ఒకరికొకరు హెచ్చరించుకునేందుకు ఎలాంటి రహస్య కోడ్‌లు, సంకేతాలు, నంబర్లను ఉపయోగించకూడదు. డిజిటల్, భౌతిక రికార్డులు రోజువారీగా సరిపోలాలి. తేడాలు ఉంటే ఆర్టీఓకి నివేదించాలి.

అలాగే ప్రతి నెల 15వ తేదీ లోపు రవాణా కమిషనర్ కార్యాలయానికి నెలవారీ కంప్లయెన్స్ నివేదికలు సమర్పించాలి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే సంబంధిత ఉద్యోగులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోబడతాయి. ప్రతి దరఖాస్తుదారు పరీక్ష రోజున కచ్చితంగా ప్రత్యక్షంగా హాజరు కావాలి. రాని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ లైసెన్స్ ఇవ్వకూడదు. ఎంవీఐ ఇన్ఛార్జ్ పరీక్షకు ముందే ఆధార్ లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డు ద్వారా అభ్యర్థిని స్వయంగా ధృవీకరించాలి.

పిడుగు పడే చోటు చెప్పేస్తుంది..!