యువత లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలి
– నిరుద్యోగులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
– అభ్యర్థులకు అండగా బీఎంఆర్ ఫౌండేషన్
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– ఉచిత తరగతుల రిజిస్ట్రేషన్ ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : యువత భవిష్యత్తు కోసం లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

మంగళవారం తాండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీయంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్, రైల్వే తదితర పోటీ పరీక్షలకు నిర్వహించనున్న ఉచిత శిక్షణ తరగతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పోటీ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ పొందలేకపోతున్న యువతకు ఈ ఉచిత శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని తెలిపారు. ఉద్యోగ సాధనను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పట్టుదలతో చదివి తమ లక్ష్యాలను చేరుకోవాలని యువతకు సూచించారు.

తాండూరు ప్రాంత యువతకు విద్య, ఉపాధి అవకాశాల పరంగా అవసరమైన సహకారం అందించేందుకు బీయంఆర్ ఫౌండేషన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ధారాసింగ్, మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, ఎస్ఐఆర్ తాండూరు కన్వీనర్ పురుషోత్తంరావు, పార్లమెంట్ ఇన్చార్జి జగదీశ్వర్, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, ఎస్ఐఆర్ కొడంగల్ కోఆర్డినేటర్ మల్లేశ్ యాదవ్, పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


