అప్పుడెట్లుండే తాండూరు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అప్పుడెట్లుండే తాండూరు..!
– పట్టించుకునే వారు లేక ఆగమాగం
– పారిశుద్ధ్యం, తాగునీరు వ్యవస్థ అస్థవ్యస్థం
– గెలిపించినందుకు గోసపడుతున్న మహిళలు
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– చీపుర్లతో శుభ్రం, ఖాళీ బిందెలతో నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి: బీఆర్ఎస్‌ పాలనలో ఆదర్శంగా ఉన్న తాండూరు.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పట్టించుకునే వారు లేక ఆగమైపోతుందని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు.

ఆదివారం బీఆర్ఎస్ సమరభేరీలో భాగంగా తాండూరు పట్టణంలో తాగునీటి ఎద్దడి, పారిశుధ్య లోపాలు, డ్రైనేజీ సమస్యలపై బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. బనసన్న కట్ట వద్ద కౌన్సిలర్లు, మహిళలతో కలిసి చీపుర్లు చేతబట్టి రోడ్లను శుభ్రం చేశారు. అనంతరం భద్రేశ్వర చౌక్‌లో మహిళలతో కలిసి ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా పైలట్‌ రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతి కార్యక్రమాలతో తాండూరును పరిశుభ్రంగా తీర్చిదిద్దామని అన్నారు. అప్పట్లో ప్రజలకు ప్రతిరోజూ ఇంటింటికీ నల్లా నీరు అందేదని, ప్రస్తుతం వారం రోజులైనా నీరు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు.

ఆశపడి గెలిపించుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంతో గోస పడుతున్నామని మహిళలు చెప్పుకోవడం ఆవేధన కలిగిస్తోందని అన్నారు. తాండూరు కాగ్నా నది నుంచి ఇతర ప్రాంతాలకు నీటిని తరలించే ముందు పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చాలని రోహిత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు సొంతంగా వాటర్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

మోసం చేసిన ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల నర్సింలు, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, మాజీ ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్లు నాగలక్ష్మీ, నవీన సంతోష్ గౌడ్, ఉమా మహేశ్వరి, రూప రుద్రుపాటిల్, బీఆర్‌ఎస్‌ నాయకులు సంతోష్ గౌడ్, రుద్రుపాటిల్, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎమ్మెల్యేపై విమర్శలు హాస్యాస్పదం..!