ఎమ్మెల్యేపై విమర్శలు హాస్యాస్పదం..!
– నిధులపై వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి
– స్థాయిని గుర్తించుకుని ఆరోపణలు చేయండి
– బీఆర్ఎస్ నేత ఆరోపణలకు పటేల్ కిరణ్ కుమార్ కౌంటర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు, చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై విమర్శలు చేయడం హస్యాస్పదమని భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి మాజీ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ అన్నారు.

బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్త, ఇతర నాయకులు చేస్తున్న విమర్శలు పూర్తిగా అవాస్తవమని ఖండించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పోట్లిమారాజ్ దేవాలయ ప్రాంగణంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కేవలం 70 నుంచి 80 రోజుల్లోనే అన్నదాన సత్రం నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు.

దేవాలయ అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే ఇప్పటికే రూ.40 లక్షల నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్ ఆర్డర్లు ఇచ్చారని, ఇందుకు సంబంధించిన పత్రాలను మీడియాకు చూపించారు. మరో రూ.20 లక్షలు త్వరలో మంజూరయ్యే అవకాశం ఉందని, మొత్తంగా రూ.60 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. వీరశైవ సమాజ భవన నిర్మాణానికి రూ.25 లక్షలు, రథం సామాగ్రి భద్రపరిచే షెడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని చెప్పారు.

కుల సంఘాల భవనాలు, శ్మశానవాటికల అభివృద్ధికి కూడా ప్రొసీడింగ్స్ ఇస్తున్నారని పేర్కొన్నారు. స్థానికంగా చేపడుతున్న అభివృద్ధి పనులు జొన్నల బసవరాజ్, ప్రస్తుత చైర్మన్ మేడి మహేష్, ఇతర పెద్దల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయని తెలిపారు. భజన మండలికి సంబంధించిన రూ.1,01,016 నిధులు, వీరశైవ సమాజానికి సంబంధించిన రూ.14–15 లక్షల రికవరీ నిధుల వినియోగంలో పారదర్శకత పాటిస్తున్నామని చెప్పారు.

అభివృద్ధి పనులు దశలవారీగా పూర్తవుతాయని, వేచి చూడాలని అన్నారు. అంతేకాని ఎమ్మెల్యేపై స్థాయికి మించి విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, అభివృద్ధి పనులకు ప్రత్యర్థులు కొంత ఓపిక పట్టాలని సూచించారు.

