బషీరాబాద్ బడికి రూ.11 కోట్లతో మహర్దశ..!
– తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా బాలుర ఉన్నత పాఠశాల అభివృద్ధి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక కృషి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గ విద్యారంగ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది.

బషీరాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీజీపీఎస్)గా అభివృద్ధి చేసేందుకు రూ.11 కోట్ల నిధులు మంజూరయ్యాయి. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ప్రత్యేక కృషితో ఈ పాఠశాల అభివృద్ధికి మార్గం సుగమమైందని పేర్కొన్నారు.

ఈ పాఠశాల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా రూపుదిద్దుకుంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యను అందించే అవకాశం కలగనుంది. విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు, ఆధునిక విద్యా సదుపాయాలు, ఇతర మౌలిక వసతులు సమకూరనున్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

బషీరాబాద్తో పాటు చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు ఈ పాఠశాల అభివృద్ధి ప్రయోజనకరంగా మారనుంది. కార్పొరేట్ స్థాయి విద్యా సదుపాయాలను ప్రభుత్వ పాఠశాలలోనే అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యానికి ఈ నిధుల మంజూరు దోహదపడనుంది. తాండూరు నియోజకవర్గంలో విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కృషిలో ఈ పరిణామం కీలకంగా నిలవనుంది.


