పోలీస్ కొలువే లక్ష్యంగా చదవండి
– తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
– ఉద్యోగ లక్ష్య సాధనపై దృష్టి సారించాలి
– ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– 250 మంది అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పిలుపునిచ్చారు.

బుధవారం తాండూరు పట్టణంలోని విలియం మూన్ స్కూల్లో బీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు సిద్ధమవుతున్న సుమారు 250 మంది అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రాతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్‌తో పాటు స్టడీ మెటీరియల్ అందించడం అభినందనీయమన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు విద్యార్థులు, నిరుద్యోగ యువతకు బీఎంఆర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను అభినందించారు. నిరుద్యోగులు పోలీసు కొలువే లక్ష్యంగా చదివి ముందుకు సాగాలన్నారు.

అనంతరం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఎంఆర్ ఫౌండేషన్ 2018లో పరిగిలో సుమారు 1,500 మంది అభ్యర్థులతో ఉచిత కోచింగ్ కార్యక్రమం నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. 2022లో పరిగి నియోజకవర్గంలోని సుమారు 60 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు గైడ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగ సాధనపైనే దృష్టి పెట్టాలని సూచించారు.

“దీన్ని ఉచిత కోచింగ్‌గా చూడొద్దు. పేద విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మీరు చెల్లించాల్సిన ఫీజును నేనే చెల్లిస్తున్నాను. పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలి” అని అన్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఫిజికల్ టెస్టులు, తదుపరి రాత పరీక్షల కోసం శిక్షణ అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఉద్యోగం సాధించిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మరో విద్యార్థికి స్ఫూర్తిగా నిలవాలని అభ్యర్థులకు సూచించారు.

జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహామెహ్రాలు మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలకు కొంతకాలం దూరంగా ఉండాలని సూచించారు. మాక్ టెస్టుల్లో తక్కువ మార్కులు వచ్చినా నిరాశ చెందకుండా తప్పులను గుర్తించి సాధన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువతీ, యువకులు పాల్గొన్నారు.


