బూస్ట‌ర్ డోసుకు స‌మ‌య‌మిదే..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

బూస్ట‌ర్ డోసుకు స‌మ‌య‌మిదే..!
– స‌ర్కారు ద‌వ‌ఖాల‌లో అనుమ‌తివ్వండి
– 18ఏండ్లు పైబ‌డిన వారికి బూస్ట‌ర్ ఇస్తాం
– కేంద్రాన్ని కోరిన వైద్య‌శాఖ మంత్రి హ‌రీష్ రావు
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి : స‌ర్కారు ద‌వాఖాన‌ల్లో 18 ఏండ్లు పైబ‌డిన వారంద‌రికి బూస్ట‌ర్ డోస్ ఇచ్చేందుకు ఇదే మంచి స‌మ‌య‌మ‌ని, ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో బూస్ట‌ర్ డోస్ ఇచ్చేందుకు అనుమ‌తివ్వాల‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు కోరారు. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్ట‌ర్ మాన్సుక్ మాండ‌వీయ ఇవాళ అన్ని రాష్ట్రాల వైద్యారోగ్య శాఖ‌ల మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రిష్‌రావు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రుపున బూస్ట‌ర్ డోస్‌కు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిల‌లో అనుమ‌తి ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. 60 ఏండ్లు పైబ‌డిన వారికి మాత్ర‌మే ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో బూస్ట‌ర్ డోసు ఇచ్చారు. మిగ‌తా వారికి బూస్ట‌ర్ డోసు ఇచ్చేందుకు ఇది స‌రైన స‌మ‌యం అని హ‌రీశ్‌రావు అన్నారు. 18 ఏండ్లు పైబ‌డిన వారంద‌రికీ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో బూస్ట‌ర్ డోస్ ఇచ్చేందుకు అనుమ‌తివ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అయితే ఈ విష‌యంపై ఇప్ప‌టికే కేంద్రానికి రెండు సార్లు లేఖ‌లు రాశామ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స్పంద‌న లేద‌ని మంత్రి గుర్తు చేశారు. ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్స్ బీఏ.4, బీఏ.5 కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో అర్హులైన వారంద‌రికీ బూస్ట‌ర్ డోస్ ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. రాష్ట్రంలో 32 ల‌క్ష‌ల డోసుల వ్యాక్సిన్ నిల్వ ఉంద‌న్నారు. ఆ వ్యాక్సిన్ గ‌డువు తేదీ ముగిసేలోగా బూస్ట‌ర్ డోస్‌కు అనుమ‌తిస్తే ఉప‌యోగం ఉంటుంద‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. అదేవిధంగా అన్ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో సాధ్య‌మైనంత వ‌ర‌కు కొవిడ్ ర్యాపిడ్ టెస్టులు, ఆర్టీ పీసీఆర్ టెస్టుల‌ సంఖ్య పెంచుతున్నామ‌ని మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ, సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డీహెచ్ శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.