స‌ర్కారు విద్య దేశానికి ఆద‌ర్శం

కెరీర్ తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

స‌ర్కారు విద్య దేశానికి ఆద‌ర్శం
– సీఎం ముందుచూపుతోనే అంద‌రికి కార్పోరేట్ విద్య‌
– గురుకులాల‌ను కాలేజీలుగా పురోగతి
– జిల్లాకు 4 చొప్పున 132 స్టడీ సెంటర్ల ఏర్పాటు
– తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిది: అంద‌రికి కార్పోరేట్ స్థాయి విద్య‌నందిస్తున్న తెలంగాణ స‌ర్కారు దేశంలోనే ఆద‌ర్శంగా నిలిచింద‌ని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ, వ‌యోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. బుధవారం తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై రాజీవ్ గృహకల్ప సమీపంలో రూ. 18 కోట్లతో నిర్మించిన తెలంగాణ మైనార్టీ రెవిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీ, రూ.1.40 కోట్లతో నిర్మించిన మైనార్టీ కామన్ సర్వీస్ సెంటర్ భవనంకు ప్రారంభోత్సవం, తాండూరు పట్టణానికి సంబంధించి రూ. కోటితో నిర్మిస్తున్న అంబేద్కర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన, రూ. 53 లక్షలతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన ప్రహారి గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం యాలాల మండలంలో రూ. 50 లక్షలతో నిర్మించే అంబేద్కర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రెసిడెన్సిషన్ స్కూళ్ల విద్యా విధానంతో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఆరేండ్లలో 978 గురుకులాలను ఏర్పాటు చేయడమే.. కాకుండా వాటిని క్రమంగా కాలేజీలుగా పురోగతి చేస్తున్నారని తెలిపారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.20లక్షలు ఖర్చు చేస్తూ కార్పోరేటు ధీటుగా విద్యనందిస్తున్నారని, ఇందుకు అనుగుణంగా విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల విదేశీ విద్యకు ప్రాధాన్యమివ్వడం జరుగుతుందన్నారు.

మొక్కుబడిగా ఉన్న విద్యా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. గతంలో 10 ఉన్న స్టడీ సెంటర్లను ప్రతి జిల్లాకు 4 చొప్పున 132 కొత్త స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి, నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలను మెరుగు పరుస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో నాణ్యమైన విద్యనందిస్తూ తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. టీఎస్‌ఈడ‌బ్య్లూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందన్నారు. మనఊరు – మన బడి కార్యక్రమాలతో కార్పోరేట్ విద్యను అందిస్తోందన్నారు.

ఎమ్మల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు రూ. 2వేల కోట్లు సాధించి అభివృద్ధి పనులు మంజూరు చేయించడం జరిగిందని, ప్రస్తుతం ఆవే పనులు కొనసాగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 15 ఏండ్ల నుంచి పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ తాండూరు రూపు రేఖలను మార్చేందుకు కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అంతకుముందు తాండూరు పట్టణంలో నిరుద్యోగ యువత కోసం నిర్వస్తున్న ఫ్రీ కోచింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి కొ ప్పుల ఈశ్వర్ హాజరై పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటిరియల్‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, యాలాల ఎంపీపీ నాలేశ్వర్ గుప్త, వైస్ ఎంపీపీ రమేష్. టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ‌ అధ్యక్షులు అప్పూ(సయూం), మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, మంకాల రాఘవేందర్, సంగీత ఠాకూర్, మెహరాజ్ భేగం, నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.