ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
– వెయ్యి మందికి పైగా పరీక్షలు
– వైద్యులను సన్మానించిన జమియతే ఉలేమా ఏ హింద్
తాండూరు, దర్శిని ప్రతినిధి: జమియతె ఉలెమా-ఎ-హింద్ వికారాబాద్ జిల్లా, హైదరాబాద్‌కు చెందిన ముజ్తబా హెల్పింగ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తాండూరులో నిర్వహించిన ప్రత్యేక ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.

పట్టణంలోని వైట్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన శిబిరంలో మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులకు వెయ్యి మందికి పైగా ఉచిత పరీక్షలు, స్క్రీనింగ్ నిర్వహించి వైద్య సలహాలు అందించారు. తాండూరు నియోజకవర్గంతో పాటు కోడంగల్, దౌలతాబాద్, బొంరాస్‌పేట్, మర్పల్లి ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఇంటెగ్రో హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ మహమ్మద్ ఫైజుల్లాహ్ ఖాన్, కింగ్ స్టోన్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ మహమ్మద్ ఫైసల్ ఖాన్‌తో పాటు వారి వైద్య బృందం సేవలందించింది. జమియతె ఉలెమా-ఎ-హింద్ జిల్లా అధ్యక్షుడు మౌలానా మహమ్మద్ అబ్దుల్లాహ్ అజ్హర్ ఖాస్మీ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో జిల్లా మైనారిటీ చైర్మన్ ఖ్వాజా సలాహుద్దీన్ ఆమిర్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుర్ రజాక్, ముఫ్తీ మిరాజుద్దీన్ అబ్రార్ తదితరులు పాల్గొన్నారు. శిబిరం విజయవంతానికి ముజ్తబా హెల్పింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు షేక్ మహమ్మద్ ముస్తఫా బృందం ప్రత్యేక కృషి చేసింది.

అనంతరం సేవలందించిన వైద్యులను నిర్వాహకులు జ్ఞాపికలతో సత్కరించారు. మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్బీఒఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ముస్లిం, మైనారిటీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


