ఎలెన్‌ది ఎంత అదృష్టమో..!
– లాటరీలో రూ. 16 కోట్ల ఇంజెక్షన్
– వ్యాధికి పునర్‌జన్మ పొందిన పసిపాప
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: అభం.. శుభం తెలియని ఆ పసిపాప జన్యుపరమైన వ్యాధి బారిన పడింది. అలాంటి జన్యుపరమైన వ్యాధులకు గురైన వారు ప్రాణాలతో జీవించడం ఎంతో కష్టం. కాని ఎలెన్ అనే చిన్నారి ఓ లాటరీ ద్వారా రూ. 16 కోట్ల విలువైన ఓకే ఒక ఇంజెక్షన్‌తో పునర్ జన్మ పొందింది. అందుకే తమ కూతురుకు ఎంత అదృష్టమో అంటూ పేద తల్లిదండ్రులు సంబర పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని రేగుబల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్, స్టెల్లా దంపతుల కుమార్తె ఎలెన్ రెండేళ్ల క్రితం నుంచి జన్యుపరమైన వ్యాధితో బాధపడుతుంది. ఈ వ్యాధి పూర్తిగా నయం కావడానికి కావలసిన ఇంజెక్షన్ విలువ 16 కోట్ల రూపాయలుగా ఉంది. నిరుపేద కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు దాతల సహాయంతో హైదరాబాద్ లోని రెయిన్‌బో హాస్పిటల్‌లో చికిత్స చేయిస్తున్నారు. అయితే హాస్పిటల్ ఖర్చులకే డబ్బులు లేక దాతల కోసం ఎదురుచూస్తున్న వీరికి స్విట్జర్లాండ్‌కు చెందిన నోవర్టీస్ కంపెనీ ఈ ఇంజక్షన్ అందుబాటులో లేని దేశాలలో లాటరీ నిర్వహించి ఏడాదికి 100 ఇంజక్షన్ లు ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసింది. రెయిన్బో హాస్పిటల్ నందు పాపకు చికిత్స అందిస్తున్న డా. రమేష్.. పాప తల్లిదండ్రులతో ఆ ఇంజెక్షన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించారు. అదృష్టం కొద్దీ వీరికి లాటరీలో ఆ ఇంజక్షన్ వచ్చింది. దీంతో తమకు దక్కదు అనుకున్న చిన్నారి లాటరీ ద్వారా ఇంజక్షన్ లభించడంతో పునర్జన్మ పొందింది. పాపకు చికిత్స అందించడంలో సహాయ పడిన ప్రతి ఒక్కరికీ ప్రవీణ్ కుమార్ స్టెల్లా దంపతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.



