దేశ భద్రతలో వీఎల్ఎఫ్ పాత్ర కీలకం
– అభివృద్ధి కోసం అందుకు కలిసి ముందుకెళ్లాలి
– నావికా రంగం బలోపేతం కోసం కట్టుబడి ఉన్నాం
– కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
– దామగుండంలో రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన
– పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నేతలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : దేశ భద్రతలో వీఎల్ఎఫ్(వేరీ లో ఫ్రీక్వెన్సీ) పాత్ర కీలకం కాబోతుందని, ఈ సాకేంతికయుగంలో ముందడుగు వేయబోతున్నామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వు ఫారెస్టులో రాడార్ స్టేషన్ నిర్మాణానికి రాజ్‌నాథ్ సింగ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం జయంతి నాడు వీఎల్ఎఫ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.
ప్రాజెక్టుకు ఏర్పాటుకు అన్ని విధాలా అండగా నిలిచిన సీఎం రేవంత్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. రక్షణరంగ పరికరాల తయారీలో హైదరాబాద్‌కు గొప్ప పేరుందని, దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకంగా మారిందన్నారు.

దేశ భద్రత విషయంలో వీఎల్ఎఫ్ పాత్ర కీలకమన్నారు. కమ్యూనికేషన్ విషయంలో ఈ కమాండ్ సెంటర్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు. నావికారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నాం. కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్ఠం చేసుకోవడం అనివార్యం. ఇండోపసిఫిక్ ప్రాంతంలో పుష్కలంగా ఖనిజ సంపద ఉంది. సముద్రంపై ఆధిపత్యం సాధించిన వాళ్లే మరింత అభివృద్ధి చెందుతారు. సముద్రంపై ఆధిపత్యం ఆంగ్లేయుల విస్తరణకు ఎంతో ఉపయోగపడింది. అత్యాధునిక పరికరాల ద్వారా రక్షణరంగాన్ని బలోపేతం చేస్తామని అన్నారు.
పార్టీలు వేరైనా దేశరక్షణే ధ్యేయం: సీఎం రేవంత్‌రెడ్డి
పార్టీలు వేరైనా.. సిద్దాంతాలు వేరైనా దేశ భద్రత, రక్షణ విషయంలో ముందు ఉడడంతో తమ ధ్యేయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ భద్రత, రక్షణ విషయంలో మేం ఎప్పుడూ మీతో కలిసి వస్తాం. దేశ రక్షణ పరికరాల తయారీలో హైదరాబాద్‌కు మంచి పేరుంది.

దేశ భద్రత విషయంలో హైదరాబాద్ వ్యూహాత్మక ప్రాంతమని అన్నారు. వీఎల్ఎఫ్ ఏర్పాటుకు అత్యంత వ్యూహాత్మక ప్రాంతం వికారాబాద్ జిల్లా. కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తూ వివాదాలకు తెరలేపుతున్నారు. దేశ భద్రత ప్రాజెక్టులకు రాజకీయం చేయడం సరికాదు. ఈ ప్రాజెక్టుకు భారాస ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చింది. దేశ రక్షణ విషయంలో రాజకీయాలు చేయనివ్వం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, నేవీ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
2900 ఎకరాలలో నేవీ రాడార్ నిర్మాణం
ఈ స్టేషన్ నిర్మాణానికి అటవీ శాఖకు చెందిన 2,900 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ‘ఈస్టర్న్ నావెల్ కమాండ్’కు ఆరు నెలల క్రితమే అప్పగించింది. దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్‌తో పాటు టౌన్షిప్ నిర్మాణం కానుంది. ఇందులో పాఠశాలలు, ఆసుపత్రి, బ్యాంక్, మార్కెట్ వంటి సదుపాయాలుంటాయి. నేవీ యూనిట్లో సుమారు 600 మంది ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఉంటారు. మొత్తంగా ఈ టౌన్షిప్లో సుమారు 2,500-3,000 మంది నివసించే అవకాశముంది. ఈ ప్రాజెక్టులో భాగంగా దామగుండం రిజర్వ్ ఫారెస్టు చుట్టూ దాదాపు 27 కి.మీ. రోడ్డును నిర్మించనున్నారు. కొత్త వీఎల్ఎఫ్ కేంద్రాన్ని 2027 లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇదికూడా చదవండి…

