చాయ్‌వాలీ కాన్ఫిడెన్స్‌కు హ్యాట్సాఫ్
– బీటెక్ చదువుతూ టీ స్టాల్
– లక్ష్యాన్ని గుర్తుచేసేలా వ్యాపారం
– అభినందిస్తున్న నెటిజన్లు
దర్శిని డెస్క్: అందరు జీవితంలో ఏదో లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. అందుకు ఎంతో కొంత సమయం పడుతుందని ముందే ఆలోచనకు వస్తారు. ఇన్నేండ్లలో తమ కల నెరవేరవచ్చని కలలు కంటారు. ఆ కలలతో గడిచిన కాలాన్ని పట్టించుకోరు. ఎందుకంటే వారి లక్ష్యం ఏమిటన్నది ముందే తెలుసు కాబట్టి. కానీ డిగ్రీ చదివే ఓ అమ్మాయి మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించింది. డిగ్రీ పూర్తయ్యే తరువాత నాలుగేళ్లలో సొంతంగా వ్యాపారం చేయాలన్నేదే ఆమె లక్ష్యం. ఇందుకు ఇంకా సయమం ఉంది కదా అని ఊరికే కూర్చోలేదు. ఓ వైపు బీటెక్ చదువుతూనే మరోవైపు తన లక్ష్యాన్ని గుర్తుచేసేలా చాయ్‌వాలీ అవతారం ఎత్తింది. ఈ విషయం నెట్టింట్లో వైరల్‌గా మారడంతో అందరు ఆమెను అభినందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన వార్తికా సింగ్‌తన డిగ్రీ నిమిత్తం హరియాణాలోని ఫరీదాబాద్‌కు వచ్చింది. అక్కడ ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తోంది. సొంతంగా వ్యాపారం చేయడమే ఆమె లక్ష్యం. కానీ తన డిగ్రీ చేతికి వచ్చేసరికి నాలుగు సంవత్సరాలు పడుతుంది. ‘నా బీటెక్ పూర్తయ్యే వరకూ వేచి ఉండటంలో అర్థం లేదు. అప్పటివరకు సమయం వృథా చేయడం సరికాదు’ అని వీడియోలో చెప్పిన మాటలు ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని తెలుపుతున్నాయి. లక్ష్యం కోసం ఎదురు చూస్తూనే ఆ లక్ష్యం కోసం ఆలస్యం చేయకుండా ఫరీదాబాద్‌లోని గ్రీన్ ఫీల్డ్ వద్ద బీటెక్ చాయ్‌వాలీ పేరుతో టీ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా టీస్టాల్ వద్ద తన లక్ష్యాన్ని ఎప్పుడూ గుర్తుచేసేలా ‘ఆత్మవిశ్వాసం, కృషి ఎప్పుడూ విజయాన్నే ఇస్తాయి’ అని స్టాల్ దగ్గర ఓ బ్యానర్‌నూ పెట్టుకుంది. తన కాలేజ్ పూర్తైన తర్వాత సాయంత్రం 5.30 గంటల నుంచి తొమ్మిది గంటలవరకు టీ విక్రయిస్తోంది. ఆమె దగ్గర లెమన్, మసాలా చాయ్ కూడా అందుబాటులో ఉన్నాయి. చివరగా ఈ వీడియోలో ఆమె ఒక అభ్యర్థన కూడా చేసింది. ‘ఈ వీడియోను షేర్ చేసి, వైరల్ చేయకండి. దాని వల్ల ఏమీ రాదు. ఇక్కడకు వచ్చి, ఒకసారి టీ తాగి చూడండి. నచ్చకపోతే మళ్లీ రావొద్దు’ అంటూ తన పనిలో నిమగ్నమైంది. వీడియోను చూసిన నెటిజన్లు ఆమె కాన్ఫిడెన్స్‌పై ప్రసంశలు కురిపిస్తున్నారు. ‘మీ ఆత్మవిశ్వాసం మెప్పిస్తోంది’ అని, ‘ఇలాగే ముందుకు సాగండి. ఏడాదిలో మీరొక బ్రాండ్ అవుతారు’ అంటూ వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.

