ఆధార్‌ ఆఫ్‌గ్రేడ్‌లో మార్పులు..!

కెరీర్ జాతీయం టెక్నాలజీ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం లైఫ్-స్టైల్ వికారాబాద్ హైదరాబాద్

ఆధార్‌ ఆఫ్‌గ్రేడ్‌లో మార్పులు..!
– కేటగిరీలుగా విభజించిన కేంద్రం
– ఆ ఒక్క మార్పుకు ఓకే చాన్స్
– కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయంటే
దర్శిని డెస్క్‌: విద్య, వైద్యం, ఉద్యోగం.. ఇలా ఎక్కడైనా ఆధార్ కార్డు ఉండాల్సిందే. సంక్షేమ పథకాల మంజూరు, భూముల రిజిస్ట్రేషన్, బ్యాంకు పాస్​బుక్, ఉపాధి హామీ పనుల కల్పన, భూముల క్రయవిక్రయాలు, విద్యార్థుల చదువులు, స్కాలర్​షిప్, పంటల విక్రయాలకు ఆధార్ కార్డు ఉండటం తప్పనిసరిగా మారింది. అయితే కొందరు ఆధార్‌ కార్డుతో మోసాలకు పాల్పడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ క్రమంలో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఆధార్‌ కార్డు సవరణలో నయా రూల్స్ తీసుకవచ్చింది. గతంలో ఆధార్ కార్డులో సులభంగా సవరణలు చేసుకునేందుకు వీలుండేది. ఇకపై ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేలా చర్యలు చేపట్టింది.

మూడు కేటగిరిలుగా విభజన
ఆధార్​ను సవరణ చేసుకునే వారిని వయసుల ప్రకారం మూడు కేటగిరీలుగా విభజించారు. కొత్త నిబంధనల ప్రకారం సవరణలో మార్పులు దరఖాస్తు చేసే విధానాన్ని మార్చేసింది. ఐదేళ్లలోపు పిల్లలను మొదటి, 5 నుంచి 18 ఏళ్ల లోపు వయసు వారిని రెండు, 18 ఏళ్లు పైబడిన వయసు వారిని మూడో కేటగిరీగా విభజించారు. వీరికి వేర్వేరుగా దరఖాస్తులను తయారు చేశారు. ధ్రువపత్రాలు, వయసును బట్టి కూడా కేటగిరీల వారీగా సమర్పించే డాక్యుమెంట్లలోనూ మార్పులు చేస్తూ ఇటీవల యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది.

నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..?
ఆధార్ కార్డును ప్రతి పదేళ్లకు ఓసారి పునరుద్ధరించుకోవాలి. అడ్రస్​ను, స్థానికతను నిర్ధారించుకుంటూ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు కావాల్సిన అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను జత చేయాలి. ఇంతకు ముందు గెజిటెడ్‌ అధికారితో సంతకం చేయించడం ద్వారా వ్యక్తి పేరు, తండ్రి పేరు, చిరునామా, పుట్టిన తేదీ మార్పు చేసుకునే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు మున్సిపల్‌ కమిషనర్‌, తహసీల్దారు జారీ చేసే గుర్తింపు పత్రాన్ని చూపించాలి. ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు, బ్యాంక్‌ పాస్‌బుక్‌, రేషన్‌కార్డులో సరైన అడ్రస్ ఉంటే వాటితో కూడా సరి చేసుకోవచ్చు. నీటి పన్ను, కరెంట్ బిల్లు, టెలిఫోన్‌ బిల్లు, గ్యాస్‌ కనెక్షన్‌ రసీదులను కూడా ఉపయోగించుకోవచ్చు.

ఇప్పుడు ఈ రూల్స్ పాటించాల్సిందే…
ఆధార్ కార్డులో పేరులో మార్పు చేయాలంటే తప్పరిసరిగా ఫొటో ఉన్న ధ్రువపత్రాన్ని సమర్పించాలి. టెన్త్ క్లాస్ మార్కుల జాబితా, పాన్‌ కార్డు, ఓటర్‌ గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, పాస్‌పోర్టు, ఉపాధి హామీ జాబ్‌కార్డు తదితర ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి జతపర్చాలి. ఉద్యోగులు వారి గుర్తింపు కార్డు, వివాహితులైతే మ్యారేజ్ సర్టిఫికేట్, తహసీల్దారు జారీ చేసిన కుల ధ్రువపత్రం సమర్పించొచ్చు. అదే పుట్టిన తేదీలో మార్పు అయితే.. చిన్నారులకైతే తప్పనిసరిగా మున్సిపల్‌ లేదా పంచాయతీ నుంచి జారీ చేసిన బర్త్ సర్టిఫికేట్ సమర్పించాలి. ఇది కూడా ఒకసారి మాత్రమే సవరించుకునే వీలును కేంద్ర సర్కారు కల్పించింది. రెండోసారి మార్పు చేసుకోవాలనుకుంటే మాత్రం ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి వెళ్లి తగిన వివరణ ఇస్తూ సర్టిఫికేట్లను సమర్పించాల్సి ఉంటుంది.