పోలీసులకే కత్తి చూపించిన దొంగ
– సాహసం చేసి పట్టుకున్న పోలీసులు
– ఇరాని గ్యాంగ్ దొంగకు కళ్లెం
తాండూరు, దర్శిని ప్రతినిధి: మాయ మాటలు చెప్పి మోసం చేయడం.. మాటల్లో పెట్టి డబ్బులతో ఉడాయించడం ఇరానీ గ్యాంగ్ ప్రత్యేకత. ఆ గ్యాంగ్‌కు చెందిన దొంగ పోలీసులకే కత్తి చూపించి పరారయ్యే ప్రయత్నం చేశాడు. పోలీసులు చేసిన సాహసంతో పట్టుపడిపోయాడు. ధీరోత్తతను ప్రదర్శించిన పోలీసులు దొంగ ఆగడాలకు కళ్లెం వేశారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం జరిగిన ఈ సంఘటన తాండూరులో సంచలనం అయ్యింది. ఈనెల 3వ తేదిన తాండూరు పట్టణంలోని స్టేట్ బ్యాంకు మేయిన్ బ్రాంచ్‌లో సాయిపూర్‌కు చెందిన గిరిబాబు అనే వ్యక్తిని మాయమాటలు చెప్పి రూ. 7,500తో ఓ దొంగ పరారైన సంఘటన జరిగింది. అప్పట్లో సీసీ పుటేజీల ఆధారంగా దొంగపై తాండూరు పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో సోమవారం తాండూరు పట్టణం శాంత్ మహాల్ థియేటర్ సమీపంలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఏడీబీ శాఖలో ఇరానీ గ్యాంగుకు చెందిన ఆ దొంగ వచ్చాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పట్టణ పోలీస్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు శివ, నర్సింలు బ్యాంకుకు చేరుకున్నారు. అప్పటికే అనుమానం వచ్చిన దొంగ వారికి కత్తి చూపించి బెధించాడు. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్‌కు స్వల్ప గాయం అయ్యింది. అయినా పోలీసులు బెధరకుండా దొంగను అడ్డుకుని పట్టుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసుల విధుల అంకింత భావానికి ఫిదా అయ్యారు. పోలీసులంటే ఇలాగే ఉండాలని ప్రశంసలు కురిపించారు. అయితే పోలీసు ఉన్నతాధికారులు ఈ సంఘనను ఇంకా దృవీకరించలేదు.

